
రైతులకు అండగా ప్రభుత్వం
వనపర్తి రూరల్: తడిసిన ధాన్యం గురించి రైతులు అధైర్యపడొద్దని.. ప్రభుత్వం అండగా ఉంటుందని, కేంద్రాల్లో చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి భరోసానిచ్చారు. సోమవారం మండలంలోని అంకూరులో సింగిల్‌విండో ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రాన్ని ఆయన సందర్శించి ధాన్యాన్ని పరిశీలించారు. కేంద్రాలకు ధాన్యం తీసుకొచ్చిన రైతుల వివరాలను నమోదు చేయాలని వారికి, తేమశాతం, తాలు పేరుతో రైతులను సతాయిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఆయన వెంట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్‌గౌడ్, ఉపాధ్యక్షుడు రామకృష్ణారెడ్డి, తహసీల్దార్ రమేశ్‌రెడ్డి, మాజీ ఎంపీపీ కిచ్చారెడ్డి, ఆర్‌ఐ మధుసూదన్, కాంగ్రెస్ నాయకులు, రైతులు పాల్గొన్నారు.
వరి కొనుగోలు కేంద్రం ప్రారంభం..
గోపాల్‌పేట: మండల కేంద్రంలోని కోదండ రామస్వామి ఆలయం వద్ద ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాన్ని సోమవారం ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ధాన్యం తూకం చేసిన వెంటనే మిల్లులకు తరలించడం, రైతుల ఖాతాల్లో డబ్బులు జమ కావడం వెంటవెంటనే జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆయన వెంట ఉమ్మడి మండలాల ఇన్‌చార్జ్ సత్యశిలారెడ్డి, శివన్న, నాగశేషు, కొంకి వెంకటేష్, కొంకి రమేష్, కోటిరెడ్డి తదితరులు ఉన్నారు.
బాధితుడికి పరామర్శ..
మండలంలోని లక్ష్మీదేవిపల్లిలో ఆదివారం సాయంత్రం పిడుగుపాటుతో 25 గొర్రెలు మృతి చెందాయన్న విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే మేఘారెడ్డి సోమవారం ఉదయం గ్రామానికి చేరుకొని బాధితులను పరామర్శించారు. ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం త్వరగా అందేలా చూడాలని తహసీల్దార్ తిలక్‌కుమార్‌రెడ్డి, పశుసంవర్థకశాఖ అధికారి వెంకటేశ్వర్లుకు సూచించారు. సరోజ అనే మహిళ గాయపడిందని తెలుసుకుని వెంటనే జిల్లా ఆస్పత్రిలో చూపించాలని చెప్పారు. తక్షణ ఆర్థిక సాయంగా రూ.20 వేలు అందించారు.