ఆట అదుర్స్‌.. అతడిని టీమిండియాకి ఎంపిక చేయండి: పీటర్సన్‌ | Kevin Pietersen Backs KL Rahul T20I Comeback For India To Bat At 4 | Sakshi
Sakshi News home page

అదరగొడుతున్నాడు.. అతడిని టీమిండియా టీ20 జట్టులోకి తీసుకోండి: పీటర్సన్‌

Published Mon, Apr 28 2025 3:24 PM | Last Updated on Mon, Apr 28 2025 4:03 PM

Kevin Pietersen Backs KL Rahul T20I Comeback For India To Bat At 4

Photo Courtesy: BCCI

ఐపీఎల్‌-2025 (IPL 2025)లో టీమిండియా స్టార్‌ క్రికెటర్‌ కేఎల్‌ రాహుల్‌ (KL Rahul) అదరగొడుతున్నాడు. ఈ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ తరఫున ఇప్పటి వరకు ఎనిమిది మ్యాచ్‌లు ఆడిన ఈ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ 364 పరుగులు సాధించాడు. 60.66 సగటుతో 146.18 స్ట్రైక్‌రేటుతో మూడు అర్ధ శతకాల సాయంతో రాహుల్‌ ఈ మేర పరుగులు రాబట్టాడు.

ఈ నేపథ్యంలో ఢిల్లీ క్యాపిటల్స్‌ మెంటార్‌, ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ కెవిన్‌ పీటర్సన్‌ (Kevin Pietersen) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రాహుల్‌ ప్రస్తుతం సూపర్‌ ఫామ్‌లో ఉన్నాడని.. అతడిని భారత టీ20 జట్టులోకి తీసుకోవాలని సెలక్టర్లకు సూచించాడు. కాగా ఐపీఎల్‌-2025లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌ ఆదివారం రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుతో తలపడింది.

ఈ మ్యాచ్‌లో నాలుగో స్థానానికి ప్రమోట్‌ అయిన రాహుల్‌.. 39 బంతుల్లో మూడు ఫోర్ల సాయంతో 41 పరుగులు చేశాడు. మిగతా బ్యాటర్లంతా విఫలమైన వేళ కాస్త మెరుగ్గా ఆడి.. ఢిల్లీ టాప్‌ రన్‌ స్కోరర్‌గా నిలిచాడు. ఇక ఈ మ్యాచ్‌లో నిర్ణీత 20 ఓవర్లో ఎనిమిది వికెట్లు కోల్పోయి 162 పరుగులు చేసిన ఢిల్లీ.. లక్ష్యాన్ని కాపాడుకోలేకపోయింది.

బెంగళూరు జట్టు ఈ టార్గెట్‌ను 18.3 ఓవర్లలో నాలుగు వికెట్లు నష్టపోయి పూర్తి చేసింది. ఈ నేపథ్యంలో బెంగళూరు జట్టు చేతిలో ఓటమి అనంతరం మీడియాతో మాట్లాడిన పీటర్సన్‌.. రాహుల్‌ ఆట తీరు పట్ల మాత్రం సంతృప్తి వ్యక్తం చేశాడు.

అతడే నా మొదటి ఎంపిక
‘‘టీమిండియా తరఫున టీ20 క్రికెట్‌లో కేఎల్‌ రాహుల్‌ను నాలుగో స్థానంలో ఆడించాలి. భారత జట్టులో చాలా మంది ఓపెనింగ్‌ బ్యాటర్లు ఉన్నారు. రోహిత్‌ శర్మ, సూర్యకుమార్‌ యాదవ్‌.. ఇలా ఎవరైనా టాపార్డర్‌లో బ్యాటింగ్‌ చేయగలరు.

అయితే, కేఎల్‌ రాహుల్‌ ప్రస్తుతం ఆడుతున్న విధానం అమోఘం. నాలుగో స్థానంలో చక్కగా బ్యాటింగ్‌ చేయడం సహా.. వికెట్‌ కీపర్‌గానూ బాధ్యతలు నిర్వర్తించగలడు. కాబట్టి టీమిండియా నంబర్‌ ఫోర్‌ బ్యాటర్‌, వికెట్‌ కీపర్‌గా అతడే మొదటి ఎంపిక’’ అని పీటర్సన్‌ పేర్కొన్నాడు.

గతేడాది కాలంగా కేఎల్‌ రాహుల్‌ అద్భుతంగా ఆడుతున్నాడని.. ముఖ్యంగా చాంపియన్స్‌ ట్రోఫీ-2025లో అదరగొట్టాడని పీటర్సన్‌ ప్రశంసించాడు. వేర్వేరు ఫార్మాట్లలో రాణించగల సత్తా అతడికి ఉందని.. సానుకూల దృక్పథమే రాహుల్‌కు బలంగా మారిందని పేర్కొన్నాడు. ఆట పట్ల అంకితభావం, నెట్స్‌లో శ్రమించే తీరు.. జట్టు ప్రయోజనాల గురించి ఆలోచించే విధానం రాహుల్‌లో తనకు నచ్చాయని తెలిపాడు.

చివరగా 2022లో టీమిండియా తరఫున
కాగా 2016లో అంతర్జాతీయ టీ20లలో అడుగుపెట్టిన కేఎల్‌ రాహుల్‌.. చివరగా 2022లో టీమిండియా తరఫున పొట్టి మ్యాచ్‌ ఆడాడు. టీ20 ప్రపంచకప్‌-2022 సందర్భంగా ఇంగ్లండ్‌తో రెండో సెమీ ఫైనల్‌ సందర్భంగా బరిలోకి దిగాడు. ఆ మ్యాచ్‌లో ఓపెనర్‌గా వచ్చిన రాహుల్‌ ఐదు పరుగులే చేసి నిష్క్రమించాడు.

ఇక ఆ తర్వాత మళ్లీ భారత టీ20 జట్టుకు రాహుల్‌ ఎంపిక కాలేదు. అయితే, టెస్టుల్లో, వన్డేల్లో మాత్రం ఆడుతున్నాడు. ఈ ఏడాది ఆస్ట్రేలియా పర్యటనలో బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీ సందర్భంగా టెస్టు ఆడిన ఈ కర్ణాటక బ్యాటర్‌.. చాంపియన్స్‌ ట్రోఫీ-2025 (వన్డే) గెలిచిన భారత జట్టులో సభ్యుడిగా ఉన్నాడు.

ఇదిలా ఉంటే.. ఐపీఎల్‌లో గతేడాది వరకు లక్నో సూపర్‌ జెయింట్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన రాహుల్‌.. మెగా వేలానికి ముందు ఆ ఫ్రాంఛైజీతో తెగదెంపులు చేసుకున్నాడు.  ఈ క్రమంలో ఢిల్లీ క్యాపిటల్స్‌ రూ. 14 కోట్లకు అతడిని కొనుగోలు చేయగా.. ఈ కుడిచేతి వాటం బ్యాటర్‌ పైసా వసూల్‌ ప్రదర్శన ఇస్తున్నాడు.

చదవండి: మా గురించి మీకేం తెలుసు?.. మాకు అలాంటి పిచ్చిలేదు: సంజనా ఫైర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement