
పంట కోతల్లో ప్రమాణాలు తప్పనిసరి
వనపర్తి: కోత యంత్రాల నిర్వాహకులు వరి కోతల సమయంలో ప్రమాణాలు పాటిస్తే నాణ్యమైన ధాన్యం చేతికందుతుందని రెవెన్యూ అదనపు కలెక్టర్ జి.వెంకటేశ్వర్లు తెలిపారు. జిల్లాలో వరి కోతలు విస్తృతంగా కొనసాగుతున్న తరుణంలో సోమవారం మధ్యాహ్నం ఐడీఓసీ సమావేశ మందిరంలో కోత యంత్రాలు, వ్యవసాయ విస్తరణ అధికారులు, మిల్లర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. ఇటీవల కొనుగోలు కేంద్రాలను సందర్శించినప్పుడు చాలాచోట్ల ధాన్యంలో తాలు, మట్టి, గడ్డి ఎక్కువగా కనిపిస్తున్నాయని.. అందుకే సమావేశం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పక్వానికి రాకముందే పంట కోతలు చేపడితే తాలు ఏర్పడుతుందని.. కోత యంత్రాల నిర్వాహకులు 19–20 ఆర్‌పీఎంతో బ్లోవర్ ప్రారంభించి గేర్ స్నాట్ ఏ2–బి1లో ఉంచి పంట కోతలు చేపట్టాలని ఆదేశించారు. నాసిరకం ధాన్యం కొనడం కష్టమని.. నాణ్యత పాటించాలని సూచించారు. నిబంధనలు అతిక్రమిస్తే హార్వెస్టర్ యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వ్యవసాయ విస్తరణ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి రైతులకు, హార్వెస్టర్ల నిర్వాహకులకు అవగాహన కల్పించాలని.. లేనిపక్షంలో డీటీఓకు ఫిర్యాదు చేస్తే యంత్రాలు సీజ్ చేస్తారన్నారు. సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి గోవింద్ నాయక్, డీటీఓ మానస, జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి కాశీవిశ్వనాథ్, డీఎం, వ్యవసాయ మండల, క్లస్టర్ అధికారులు పాల్గొన్నారు.