
వీపనగండ్ల పరీక్షా కేంద్రంలో వసతులు పరిశీలిస్తున్న అధికారులు
వనపర్తి: పదోతరగతి వార్షిక పరీక్షలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ అధికారులను ఆదేశించారు. సోమవారం నుంచి ప్రారంభమయ్యే పరీక్షలకు సంబంధించి చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్‌మెంటల్ అధికారులు, జిల్లా అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, ఎంఈఓలతో ఆయన వర్చువల్‌గా సమావేశమై పలు సూచనలు చేశారు. ఎట్టిపరిస్థితుల్లో మాల్‌ప్రాక్టీస్‌కు అవకాశం ఇవ్వరాదని.. కేంద్రాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో పాటు విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పరీక్షా కేంద్రాల్లోకి సెల్‌ఫోన్లు అనుమతించకూడదని తెలిపారు. పరిసరాల్లో 144 సెక్షన్ అమలులో ఉంటుందన్నారు.
కేంద్రాల తనిఖీ..
వీపనగండ్ల: మండల కేంద్రంలోని 10వ తరగతి పరీక్ష కేంద్రాలను శుక్రవారం జిల్లా వ్యవసాయాధికారి సుధాకర్‌రెడ్డి, ఎంపీడీఓ కతలప్ప పరిశీలించారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. విద్యుత్, తాగునీరు, మూత్రశాలలు ఉండాలన్నారు. వారి వెంట మండల విద్యాధికారి లక్ష్మణ్‌నాయక్, సర్పంచ్ నర్సింహారెడ్డి, ఎంపీటీసీ సభ్యుడు భాస్కర్‌రెడ్డి, స్కూల్‌కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాస్‌రెడ్డి తదితరులు ఉన్నారు.
కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్