
● నిరుపయోగంగా చెత్తబుట్టలు
● ప్రధాన కూడళ్లలో స్టీల్ డస్ట్‌బిన్స్ ఏర్పాటు
● వినియోగించని ప్రజలు.. రూ.లక్షలు వృథా
పెబ్బేరు: స్వచ్ఛ పురపాలికల ఏర్పాటే లక్ష్యంగా చెత్త సేకరణతో పాటు ప్రధాన వీధుల్లో స్టీల్ డస్ట్‌బిన్స్‌ను పుర అధికారులు ఏర్పాటు చేశారు. రూ.లక్షలు వెచ్చించి ఆర్భాటంగా ఏర్పాటు చేసిన డస్ట్‌బిన్స్ మూన్నాళ్ల ముచ్చటగా మారాయి. తడి, పొడి చెత్త వేర్వేరుగా సేకరించేందుకుగాను ఇంటింటికి రెండు చెత్తబుట్టలు పంపిణీ చేయడంతో పాటు సేకరించిన చెత్తను తరలించడానికి వాహనాలు కూడా కొనుగోలు చేశారు. కొన్ని మున్సిపాలిటీలో దాతల సహకారంతో చెత్తబుట్టలు పంపిణీ చేస్తే పలుకుబడి ఉన్నవారు ఎక్కువ బుట్టలు తీసుకున్నట్లు ఆరోపణాలు వెల్లువెత్తాయి. పురపాలికల్లోని ప్రధాన వీధుల్లో స్టీల్ డస్ట్‌బిన్స్ ఏర్పాటు చేసినా వాటిని వినియోగించకపోవడంతో నిరుపయోగంగా మారాయి. కొన్నిచోట్ల తుప్పుపట్టి ఊడి కిందపడినా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ముందుచూపు లేకుండా పుర పాలకవర్గం, అధికారులు తీసుకుంటున్న నిర్ణయాలతో రూ.లక్షల ప్రజాధనం వృథా అవుతోందని తెలిపారు.
నిరుపయోగంగా..
తడి, పొడి చెత్త వేర్వేరుగా సేకరించేందుకుగాను ఇంటింటికి రెండు ప్లాస్టిక్ డస్ట్‌బిన్స్ పంపిణీ చేశారు. అమరచింతలో దాతల సహకారంతో పంపిణీ చేయగా.. మిగిలిన వనపర్తి, పెబ్బేరు, కొత్తకోట, ఆత్మకూర్‌లో రూ.41.99 లక్షలు వెచ్చించి కొనుగోలు చేసి పంచిపెట్టారు. ఇవి కొన్నిరోజుల పాటు వినియోగించినా.. తర్వాత మూలనపడేశారు. అలాగే పెబ్బేరులోని ప్రధాన వీధుల్లో రూ. లక్ష వెచ్చించి స్టీల్ డస్ట్‌బిన్స్ ఏర్పాటు చేశారు. వీటిలో కొన్ని అపహరణకు గురికాగా.. మరికొన్నింటిని కొందరు తమ సొంత అవసరాలకు వినియోగించుకుంటున్నారు. కొన్ని తుప్పుపట్టి నిరుపయోగంగా మారాయి.
వినియోగించేలా చర్యలు
పురపాలికలో ఇంటింటికి రెండు డస్ట్‌బిన్స్ ఇవ్వడంతో పాటు చెత్త సేకరణ ఆటోలు, ట్రాక్టర్లు వచ్చినపుడు తడి, పొడి చెత్తను వేర్వేరుగా ఇవ్వాలని అవగాహన కల్పిస్తున్నాం. అలాగే పట్టణంలోని ప్రధాన కూడళ్లలో ఏర్పాటు చేసిన స్టీల్ డస్ట్‌బిన్స్ ఏర్పాటు చేశాం. కొన్ని పాడవగా.. మరికొన్ని నిరుపయోగంగా మారాయి. వాటిని వినియోగంలోకి తీసుకొచ్చేలా చర్యలు తీసుకుంటాం.
– జాన్ కృపాకర్, పుర కమిషనర్, పెబ్బేరు

పెబ్బేరు బస్టాండ్‌లో నిరుపయోగంగా ఉన్న డస్ట్‌బిన్స్
