
వనపర్తి: జిల్లాలో పదోతరగతి పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ తెలిపారు. పది పరీక్షల నిర్వహణపై బుధవారం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డి హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల కలెకర్లు, విద్యాశాఖ అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయనతో పాటు ఎస్పీ రక్షిత కె.మూర్తి, అదనపు కలెక్టర్ వేణుగోపాల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏప్రిల్ 3 నుంచి ప్రారంభం కానున్న పరీక్షలకు జిల్లాలో 7,053 మంది హాజరుకానున్నారని.. మొత్తం 36 కేంద్రాలను ఏర్పాటు చేశామని వివరించారు. పోలీస్‌స్టేషన్‌కు దూరంలో ఉన్న కేంద్రాలకు ప్రశ్నపత్రాల తరలింపు కోసం రూట్లను గుర్తించామని, కేంద్రాల్లో అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశిస్తూ పర్యవేక్షణ చేస్తున్నామన్నారు. జిల్లాలో కంట్రోల్ రూం ఏర్పాటు చేశామని, 36 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 36 మంది డిపార్ట్‌మెంటల్ అధికారులు, 450 మంది ఇన్విజిలేటర్లు, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలను ఏర్పాటు చేశామని తెలిపారు. అన్ని కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో ఏఎస్పీ షాకీర్ హుస్సేన్, ఆర్డీఓ పద్మావతి, జిల్లా విద్యాధికారి రవీందర్, జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డా. రవిశంకర్, జిల్లా పంచాయతీ అధికారి సురేష్, పుర కమిషనర్లు, పోలీస్, పోస్టల్, విద్యుత్, ఆర్టీసీ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఎంసీహెచ్ ఆకస్మిక తనిఖీ..
వనపర్తి క్రైం: ప్రభుత్వ ఆస్పత్రులో పేదలకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని, వసతుల కల్పనకు నిధులు కేటాయిస్తామని కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ అన్నారు. బుధవారం జిల్లాకేంద్రం సమీపంలోని మాత, శిశు సంరక్షణ కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. రోగులకు అందుతున్న వైద్యసేవలు, సమస్యలను సూపరింటెండెంట్ డా. నరేంద్రకుమార్‌ను అడిగి తెలుసుకున్నారు. గర్భిణులు కూర్చొనేందుకు సరిపడా బెంచీలు లేవని, ఓపీ కౌంటర్స్ లేనందున రోగులు గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి ఉందన్నారు. రోగులకు మూత్రశాలలు, స్నానపు గదులు, మరుగుదొడ్లు లేవని.. నిర్మాణాలకు నిధులు మంజూరు చేయాలని కోరారు. ఆస్పత్రికి వచ్చే రోగుల సంఖ్య పెరిగిందని.. ఆవరణలో సహాయకుల కోసం నిర్మించిన షెడ్ సరిపోవడం లేదని, అదనంగా మరో షెడ్ నిర్మించాలని డా. నరేంద్రకుమార్ కలెక్టర్‌కు విన్నవించారు. ఆయా అభివృద్ధి పనులకు నిధులు కేటాయిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. ఆయన వెంట ఆర్‌ఎంఓ బంగారయ్య తదితరులు ఉన్నారు.
10 రోజుల్లో పూర్తి చేయండి..
వనపర్తిటౌన్: పెండింగ్‌లో ఉన్న రహదారి విస్తరణ పనులు 10 రోజుల్లోగా పూర్తి చేయాలని కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లాకేంద్రంలోని గాంధీచౌక్ ప్రాంతంలో కొనసాగుతున్న రహదారి పనులను ఆయన పరిశీలించారు. పనులు నత్తనడకన సాగుతుండటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఆటంకాలను అధిగమించి త్వరగా పూర్తి చేయాలన్నారు. ఆయన వెంట ఆర్‌అండ్‌బీ డీఈ దానయ్య, ఏఈ రాకేష్, అధికారులు పాల్గొన్నారు.
కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్