గురజాడ గృహానికి రక్షణ కరువు
● తలుపులు, లైట్లు బద్దలుకొట్టి లోపలకు వెళ్లిన అగంతకులు
● కొద్ది నెలల కిందట తాగుబోతు
హల్‌చల్
విజయనగరం టౌన్: విజయనగరంలోని మహాకవి గురజాడ వెంకట అప్పారావు సొంతగూటికి రక్షణ కరువైంది. మహాకవి ఇంటి పక్కన ఖాళీస్థలమంతా మలమూత్ర విసర్జనకే పరిమితమైంది. తాగుబోతులు హల్ చల్ చేయడం, మహాకవి ఇంట్లో ఏమైనా దొరుకుతాయనుకునే భ్రమలో ఉన్న తలుపులు, కిటికీలు, లైట్లు విరగ్గొట్టి మరీ లోపలికి వెళ్లడం, ఏమీ లభించకపోవడంతో పరిసరప్రాంతాలను, గురజాడ నడియాడిన ఆనవాళ్లు, వినియోగించిన పరికరాలను ధ్వంసం చేస్తున్నారు. ఈ ఏడాది ఆగస్టు 12న మత్తులో ఉన్న ఓ దొంగ ఇంటి వెనుక వైపు నుంచి లోపలికి ప్రవేశించి, మద్యం మత్తులో మహాకవి రచనలను చిందరవందర చేసి, మరికొన్ని గోడపైనుంచి బయటకు విసిరేసి నానాహంగామా చేశాడు. అధికారులు అప్పటికప్పుడు తూతూమంత్రంగా చర్యలు చేపట్టి మమ అనిపించేశారు. మరలా సోమవారం అర్ధరాత్రి అదే పరిస్థితి పునరావృతమైంది. తలుపులు పగులగొట్టారు. వస్తువులు చిందరవందర చేశారు. మంగళవారం ఉదయం విషయం తెలుసుకున్న గురజాడ వారసులు అధికారులకు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. అసలు దొంగ మద్యం మత్తులో ప్రవేశించాడా? లేదా ఇంకేదైనా ఆశించాడా అన్నది తెలియరాలేదు. గురజాడ జయంతి, వర్ధంతి కార్యక్రమాలకే తప్ప మహాకవి స్వగృహాన్ని, ఆయన రచనలను పరిరక్షించడంలో జిల్లా అధికారయంత్రాంగం, ప్రజాప్రతినిధులు ఏమాత్రం పట్టించుకోకపోవడంపై సాహితీవేత్తలు, అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మహాకవి రచనలకు భద్రత ఏదీ?
మహాకవి గురజాడ రచనలను భద్రం చేయా ల్సిన ఆర్కియాలజీ విభాగం, జిల్లా అధికార యంత్రాంగం ఎటువంటి చర్యలు చేపట్టలేదు. మహాకవి ఇంటిని పరిరక్షణకు, పక్కన ఉన్న ఖాళీ స్థలం వల్ల కలిగే ఇబ్బందులపై అధికారులకు పలుమార్లు వినతులు అందజేసినా ఏ ఒక్కరూ పటించుకోలేదు. తాజా ఘటనతో మహాకవి అభిమానులు, సాహితీసంఘాల ప్రతినిధులు ఆవేదన చెందుతున్నారు. తక్షణమే అధికారులు స్పందించి మహాకవి రచనలకు భద్రత కల్పించాలని కోరుతున్నారు.
గురజాడ గృహానికి రక్షణ కరువు
గురజాడ గృహానికి రక్షణ కరువు


