మెట్టపల్లిని సందర్శించిన వైద్య బృందం
చీపురుపల్లి: మండలంలోని మెట్టపల్లి గ్రామాన్ని ర్యాపిడ్ రెస్పాన్స్ బృందం మంగళవారం సందర్శించింది. ఇటీవల మెట్టపల్లి గ్రామంలో స్క్రబ్ టైఫస్ వైరస్ వ్యాధి లక్షణాలతో తన భార్య మృతి చెందినట్లు భర్త చెప్పిన సంగతి తెలిసిందే. ఈ మేరకు పత్రికల్లో వార్తలు ప్రచురితమయ్యాయి. దీనిపై స్పందించిన కర్లాం పీహెచ్‌సీ వైద్యులు గ్రామంలో ప్రత్యేక వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉండగా జిల్లా కేంద్రం నుంచి ర్యాపిడ్ రెస్పాన్స్ వైద్య బృందం గ్రామంలో ఇటీవల మృతి చెందిన మహిళ చందక రాజేశ్వరి ఇంటిని సందర్శించారు. ఆమె మృతికి సంబంధించిన కారణాలను కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం గ్రామంలో జ్వరాలతో బాధపడుతున్న వారి నుంచి రక్త నమూనాలు సేకరించారు. ఆరోగ్య జాగ్రత్తలు వివరించారు. వైద్య బృందంలో ప్రభుత్వ మెడికల్ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డా.శరత్‌నాయక్, డీఎస్‌ఓ సత్యనారాయణ, వినోద్ లాల్వాని, శ్రావణి, కర్లాం పీహెచ్‌సీ వైద్యురాలు శ్రీలక్ష్మి ఉన్నారు.


