4న జిల్లా సమీక్ష సమావేశం
● సమగ్ర వివరాలతో హాజరుకావాలి
● కలెక్టర్ ఎస్.రాంసుందర్‌రెడ్డి
విజయనగరం అర్బన్: కలెక్టరేట్‌లో ఈ నెల 4వ తేదీన జరగనున్న జిల్లా సమీక్ష సమావేశానికి అన్ని శాఖల అధికారులు పూర్తి స్థాయి సమాచారంతో హాజరుకావాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్‌రెడ్డి ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో జేసీ సేతుమాధవన్‌తో కలిసి వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులతో మంగళవారం ప్రాథమిక సమావేశం నిర్వహించారు. గత సమీక్షా సమావేశంలోని నిర్ణయాలపై తీసుకున్న చర్యలపై సమీక్షించారు. పభుత్వ ప్రాధాన్యతా పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల అమలు, లక్ష్యసాధన, పెండింగ్ పనులపై సమీక్షా సమావేశంలో సవివరంగా చర్చిస్తామని, అందుకు అనుగుణంగా అన్ని శాఖలు డేటా సిద్ధం చేసుకోవాలని సూచించారు. వ్యవసాయం, ఖరీఫ్, రబీ పంటల ప్రణాళిక, నీటిపారుదల ప్రాజెక్టుల స్థితిగతులు, ధాన్యం సేకరణ, గృహనిర్మాణాలు, పారిశుద్ధ్యం, వైద్యం, ఆరోగ్యశ్రీ సేవలు, విద్య, పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు, మౌలిక వసతుల కల్పన వంటి అంశాలపై వివరాలు సమర్పించాలని ఆదేశించారు. జేసీ సేతుమాధవన్ మాట్లాడుతూ నివేదికలు కేవలం సంఖ్యలతోనే కాకుండా క్షేత్రస్థాయిలో పథకాల అమలు వల్ల లబ్ధిదారులకు కలిగిన ప్రభావాన్ని ప్రతిబింబించేలా సమర్పించాలని స్పష్టం చేశారు. ఏ అధికారి అడిగినా వెంటనే సమాధానం చెప్పేలా సిద్ధం కావాలన్నారు. సమావేశంలో సీపీఓ పి.బాలాజీతోపాటు వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
భూసేకరణను వేగవంతం చేయాలి
జిల్లాలో పలు జాతీయ ప్రాజెక్టులకు చేపట్టిన భూసేకరణ ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. భూసేకరణపై తన చాంబర్లో వివిధ శాఖల అధికారులతో మంగళవారం సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. జాతీయ రహదారి 130 (సీడీ), జాతీయ రహదారి 516 (బీ), రైల్వే ఆర్‌ఓబీలు, జి.సిగడాం–విజయనగరం మూడో రైల్వేలైన్, కొత్తవలస–విజయనగరం నాలుగో రైల్వేలైన్ తదితర ప్రాజెక్టులకు భూసేకరణపై సమీక్షించారు. భూసేకరణ ప్రకటన, పరిహారం చెల్లింపు తదితర అంశాలపై ఆరా తీశారు. వీటన్నింటినీ త్వరగా పూర్తిచేయాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రతి ప్రాజెక్టుకు నిర్ణీత కాలవ్యవధిని నిర్ణయించుకొని నిర్దేశిత సమయంలోగా పూర్తి చేయాలని సూచించారు. సమావేశంలో జేసీ ఎస్.సేతుమాధవన్, ఆర్డీఓలు డి.కీర్తి, సత్యవాణి, రామ్మోహన్, ఈ–సెక్షన్ సూపరింటెండెంట్ తాడ్డి గోవింద, ఆయా శాఖల అధికారులు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.


