
ఏనుగుల సంచారంతో బెంబేలు
వంగర: మండలంలోని వివిధ గ్రామాల్లో ఏనుగుల గుంపు సంచరించడంతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. గడిచిన ఐదు రోజులుగా ఒకే ప్రదేశంలో తిష్ఠవేయడంతో అటు ప్రయాణికులు, ఇటు రైతులు ఆందోళన చెందుతున్నారు. బుధవారం కూడా మడ్డువలస వంతెన ఆవరణలోని పంటపొలాల్లో తొమ్మిది ఏనుగుల గుంపు సంచరిస్తోంది. పంట పొలాల్లో చొరబడి పంటలను నాశనం చేస్తున్నాయి. దీంతో మడ్డువలస, సంగాం, మగ్గూరు గ్రామాలకు చెందిన రైతులు ఆందోళన చెందుతున్నారు. అలాగే వంగర–రాజాం రోడ్డును ఆనుకుని ఏనుగుల గుంపు తిష్ఠ వేయడంతో పలుమార్లు పోలీస్, అటవీశాఖ అధికారులు రోడ్డును బ్లాక్ చేస్తూ వాహనాలను నిలుపుదల చేస్తున్నారు. రైతులు, వాహనచోదకులు అప్రమత్తంగా ఉండాలని, ఎలిఫెంట్ ట్రాకర్స్, రోడ్డుపై ఉన్న వివిధ శాఖల అధికారుల పరిశీలన అనంతరం ఏనుగులు సంచరించే ప్రదేశాలు దాటుకుని వెళ్లాలని సూచిస్తున్నారు.
అప్రమత్తంగా ఉండాలి
ఏనుగులు సంచరించే ప్రాంతంలో రైతులు, వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని తహసీల్దార్ హరి రమణారావు తెలిపారు. మడ్డువలస వద్ద ఏనుగుల గుంపును బుధవారం ఆయన పరిశీలించారు. అనంతరం అటవీశాఖ అధికారులు, సిబ్బందితో మాట్లాడారు. కార్యక్రమంలో అటవీ, రెవెన్యూ, పోలీస్ సిబ్బంది ఉన్నారు.
మడ్డువలస బ్రిడ్జి ఆవరణలో తిష్ఠ

ఏనుగుల సంచారంతో బెంబేలు