
సర్వజన ఆస్పత్రిలో ఎస్టీ సెల్ ఏర్పాటు
● ఎస్టీ కమిషన్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ డీవీజీ శంకర రావు
విజయనగరం ఫోర్ట్: ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి, ఘోషాఆస్పత్రుల్లో షెడ్యూల తెగల ప్రజల సహాయం కోసం ప్రత్యేకంగా ఎస్టీ సెల్ ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ డాక్టర్ డీవీజీ శంకర రావు అఽధికారులను ఆదేశించారు. ఈ మేరకు ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిని బుధవారం ఆయన తనిఖీ చేశారు. ముందుగా ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో ఓపీ విభాగాలను, జనరల్ వార్డు, సర్జరీ విభాగం, ఐసీయూ, రేడియాలజీ, సిటిస్కాన్ విభాగాలను పరిశీలించారు. ఈ సందర్భంగా రోగులతో మాట్లాడి వైద్యసేవలు, భోజన నాణ్యత గురించి తెలుసుకున్నారు. అనంతరం ఘోషాఆస్పత్రిని సందర్శించి ప్రసూతి విభాగం, పిల్లల వార్డు, ఐసీయూ, చిన్నారులకు, పోషకాహారం అందించే వార్డులను తనిఖీ చేశారు. గర్భిణులు, బాలింతలతో మాట్లాడి ఆస్పత్రిలో అందుతున్న సేవల గురించి తెలుసుకున్నారు. ఆ తర్వాత విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి, ఘోషాఆస్పత్రిలో ప్రజలకు అందుతున్న వైద్యసేవలు, ప్రజల అభిప్రాయాలు, సమస్యలు తెలుసుకుని అవసరమైన సేవల ఏర్పాటు గురించి ప్రభుత్వానికి తెలియజేసేందుకు ఆస్పత్రిని సందర్శించినట్లు చెప్పారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌ఓ డాక్టర్ ఎస్. జీవనరాణి, డీసీహెచ్‌ఎస్ డాక్టర్ పద్మశ్రీ రాణి, ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శంబంగి అప్పలనాయుడు, డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ పీఏ.రమణి తదితరులు పాల్గొన్నారు.