
రక్తహీనత నివారణలో పురోగతి ఉండాలి
పార్వతీపురం రూరల్: రక్తహీనత నివారణే ధ్యేయంగా పార్వతీపురం మన్యం జిల్లాలో చేపడుతున్న ఎనీమియా ఏక్షన్ కమిటీల ద్వారా పురోగతి సాధించే దిశగా కార్యాచరణ చేపట్టాలని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎస్.భాస్కరరావు స్పష్టం చేశారు. ఈ మేరకు మండలంలోని తాళ్లబురిడి, పెదబొండపల్లిలో నిర్వహించిన ఎనీమియా ఏక్షన్ కమిటీలను(ఏఏసీ) బుధవారం ఆయన పర్యవేక్షించారు. రక్తహీనత నివారణకు ఏ విధమైన కార్యాచరణ చేపడుతున్నారు? చేసిన కమిటీ తీర్మానం, రక్తహీనతగా గుర్తించిన గర్భిణి, బాలింతల వివరాలు అయన రికార్డులో పరిశీలించారు. గతనెలలో రక్తహీనత నివేదికల్లో ప్రస్తుతం పురోగతిపై ఆరా తీశారు. అనంతరం గర్భిణి, బాలింతలకు తగు సూచనలు, జాగ్రత్తలు తెలియజేశారు. పౌష్టికాహారం ఆవశ్యకతపై వివరించి అంగన్వాడీ కేంద్రం నుంచి అందజేస్తున్న టీహెచ్‌ఆర్ సద్వినియోగం చేసుకోవాలని, కిల్కారీ మొబైల్ సందేశాన్ని పాటించాలని సూచించారు. ఐరన్ మాత్రలు క్రమం తప్పకుండా వేసుకోవాలన్నారు. గర్భిణి ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షణ చేయాలని వైద్య సిబ్బందిని ఆదేశించారు. అనంతరం డీఎంహెచ్‌ఓ గర్భిణులకు పౌష్టికాహారం అందజేసి సీమంతం కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో జిల్లా ప్రోగ్రాం అధికారి డాక్టర్ టి.జగన్‌మోహన్‌రావు, డీపీఎంఓ డా.పీఎల్ రఘుకుమార్, వైద్యాధికారులు డా.కౌశిక్, ధరణి తదితరులు పాల్గొన్నారు.
డీఎంహెచ్‌ఓ భాస్కరరావు