
రాజధానికి జిందాల్ సెగ
● షెడ్యూల్ కులాల కమిషన్ చైర్మన్‌కు నిర్వాసితుల వినతి
శృంగవరపుకోట: జిందాల్ పరిశ్రమ తమతో ఆడుతున్న ఆటలతో అలిసిపోయిన నిర్వాసితులు తమ నిరసన సెగ రాజధానిని తాకేలా చేశారు. ఈ మేరకు బుధవారం పలువురు జిందాల్ నిర్వాసితులు రాజధాని అమరావతిలో షెడ్యూల్ కులాల కమిషన్ చైర్మన్ కె.ఎస్.జవహర్‌ను కలిసి ఆందోళన వ్యక్తం చేశారు. జిందాల్ పరిశ్రమ ఏర్పాటు కానందున తమ భూములు తమకివ్వాలని కోరారు. ఎంఎస్‌ఎంఈ పార్కులకు కావాలంటే కొత్తగా భూసేకరణ చేయాలని, తాటిపూడి నీరు తాగునీటి అవసరాలకు కేటాయించాలని, శాంతియుతంగా పోరాడుతున్న తమపై పోలీసుల దమనకాండను నిరోధించాలని కోరుతూ వినతిపత్రం ఇచ్చారు. అలాగే ప్రజాదర్బార్‌లోను, జనసేన కేంద్ర కార్యాలయంలోను వినతిపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో నిర్వాసితులు ఎం.సన్యాసిరావు, జి.ఈశ్వరరావు, ఎం.సన్యాసమ్మ, డి.సింహాచలం, బి.లక్ష్మణరావు, పి.రేవతి, కె.పైడితల్లి, బి,విజయ్‌బాబు, కేత వీరన్న, కిల్లో అర్జున, కె.సన్యాసిరావు, టి.అప్పారావు తదితరులు పాల్గొన్నారు.