
మాదక ద్రవ్యాల పట్ల అవగాహన కలిగి ఉండాలి
పార్వతీపురంటౌన్: మాదక ద్రవ్యాల పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ అన్నారు. ఈ మేరకు మాదక ద్రవ్యాల నియంత్రణ జిల్లా స్థాయి కమిటీ సమావేశాన్ని సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ శ్యామ్‌ప్రసాద్ మాట్లాడుతూ మాదక ద్రవ్యాలు, మత్తు మందులు కుటుంబాలను, ఆరోగ్యాన్ని నాశనం చేస్తాయన్నారు. వాటిపై అవగాహన అత్యావశ్యమన్నారు. ఆరోగ్యమే మహా భాగ్యమని, దానిని కాపాడుకోవడం మన కర్తవ్యమని చెప్పారు. యోగా వంటి ఆరోగ్య అంశాల పట్ల ఆసక్తి కలిగి ప్రతిరోజూ సాధన చేయడం వల్ల ప్రయోజనాలు ఉంటాయని హితవు పలికారు. మాదక ద్రవ్యాలు, మత్తు మందులు ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీయడమే కాకుండా ఆర్థికంగా, మానసికంగా కుటుంబాలను నాశనం చేస్తాయన్నారు. పాఠశాలలు, వసతి గృహాలు పునఃప్రారంభమయ్యాయని వాటి చుట్టు పక్కల ఎటువంటి విక్రయాలు, కార్యకలాపాలు జరగకుండా పటిష్టమైన నిఘా ఉండాలని స్పష్టం చేశారు. అటవీ, మారుమూల ప్రాంతంలో సారా తయారీ వంటి అంశాలను గమనించాలని ఆదేశించారు. మాదక ద్రవ్యాల విక్రయాలు వివిధ రూపాల్లో ఉండే అవకాశం ఉందని, సంబంధిత అధికారులు ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. మాదక ద్రవ్యాలు, మత్తు మందుల ఉత్పాదకత, సరఫరా, రవాణా, విక్రయాలు, వినియోగం జరిగితే చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. వాటికి సంబంధించిన వివరాలు తెలిసినవారు 1972 ఫోన్ నంబర్‌కు సమాచారం అందించాలని కోరారు. రవాణా వాహనాలను తనిఖీలు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. సమావేశంలో ఎస్పీ ఎస్వీ మాధవ రెడ్డి, పాలకొండ డీఎస్పీ ఎం.రాంబాబు, జిల్లా రవాణా అధికారి వి.దుర్గాప్రసాద్ రెడ్డి, ఏపీఎస్‌ఆర్టీసీ అసిస్టెంట్ మేనేజర్ కె.సుమిత్ర, డ్రగ్ ఇన్‌స్పెక్టర్ ఆశ షేక్, ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ సీఐ వీవీవీ ఎస్‌ఎస్‌బాబు, ఆర్‌పీఎఫ్ ఎస్సై ఎ.కె.పాణిగ్రహి, పార్వతీపురం మున్సిపల్ కమిషనర్ సీహెచ్ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.