
జూలై 1న జాతీయ వైద్యుల దినోత్సవం
విజయనగరం: ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘం విజయనగరం జిల్లా శాఖ, సీతం ఇంజినీరింగ్ కళాశాల సంయుక్తంగా జూలై 1వ తేదీన జాతీయ వైద్యుల దినోత్సవం నిర్వహిస్తున్నామని సీతం ఇంజినీరింగ్ కాలేజి డైరెక్టర్ డాక్టర్ ఎం.శశిభూషణరావు పేర్కొన్నారు. తోటపాలెం సత్య విద్యా సంస్థల వద్ద శనివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వైద్యుల దినోత్సవం ఆహ్వాన ప్రతులను ఆవిష్కరించి మాట్లాడారు. వెద్యులు ప్రాణదాతలని, సమాజంలో వారి స్థానం ఎల్లప్పుడూ గౌరవప్రదంగానే ఉంటుందన్నారు. సాంకేతికంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తదితర అంశాలతో ప్రపంచం ముందుకు వెళ్తుందని ఈ నేపథ్యంలో విద్యార్థులకు వివిధ అంశాలపై జాతీయ వైద్యుల దినోత్సవం నాడు ప్రముఖ వైద్యులతో అవగాహన కల్పిస్తామన్నారు. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘం విజయనగరం జిల్లా శాఖ అధ్యక్షుడు సముద్రాల గురుప్రసాద్, సత్య డిగ్రీ కాలేజి ప్రిన్సిపాల్ డాక్టర్ సాయి దేవమణి తదితరులు పాల్గొన్నారు.
గంజాయి కేసులో ఐదుగురు అరెస్టు
బొండపల్లి: మండలంలోని గొట్లం బైపాస్ రోడ్డు మీదుగా తరలిస్తున్న గంజాయిని స్వాధీనం చేసుకొని ఐదుగురు యువకులతో పాటు గంజాయిని సీజ్ చేసినట్టు సీఐ రమణ, ఎస్‌ఐ మహేష్ శనివారం తెలిపారు. కురుపాంకు చెందిన డి.కీర్తిరాజ్‌కుమార్, పి.అమర్, ఎం.అఖిల్, ఒడిశాకు చెందిన టి.రమేష్, ఇ.శ్యామ్‌లను అదుపులోకి తీసుకొని వారి నుంచి 1200 గ్రాముల గంజాయి, ఆరు సెల్‌ఫోన్లు, రూ.1000 నగదు స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. కేసు నమోదు చేసి నిందితులను అరెస్టు చేసినట్టు చెప్పారు.
గంజాయి పట్టివేత
రాజాం సిటీ: అక్రమంగా గంజాయి తరలిస్తున్న వ్యక్తిని పట్టుకుని అరెస్టు చేశామని టౌన్ సీఐ కె.అశోక్‌కుమార్ తెలిపారు. శనివారం చీపురుపల్లి రోడ్డులోని గాయత్రి కాలనీ సమీపంలో వాహన తనిఖీలు చేస్తుండగా 1.148 గ్రాముల గంజాయిని పట్టుకున్నామని తెలిపారు. సీఐ వివరాలు మేరకు మెరకముడిదాం మండలం మర్రివలస గ్రామానికి చెందిన వలిరెడ్డి సత్యనారాయణ ద్విచక్ర వాహనంపై చీపురుపల్లి నుంచి రాజాం వైపు వస్తున్నాడు. వాహన తనిఖీలు చేస్తుండగా అతని వద్ద ఉన్న ప్యాకెట్‌ను పరిశీలించగా 1.148 కేజీల గంజాయిగా గుర్తించి అరెస్టు చేయడంతో పాటు కేసు నమోదుచేసి రిమాండ్‌కు తరలించామని అన్నారు. అంతేకాకుండా మల్లిఖార్జునకాలనీ గాయత్రిమఠం సమీపంలో గంజాయి సేవిస్తున్న ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశామని అన్నారు.
మహిళపై దాడి చేసిన వ్యక్తి అరెస్టు
వేపాడ: మండలంలోని నల్లబిల్లి గ్రామానికి చెందిన ఈర్లి సీతారాం(65)పై అదే గ్రామానికి చెందిన ఉడతా మణికంఠ కత్తిపీటతో దాడి చేసి గాయపర్చిన సంగతి పాఠకులకు విదితమే. దీనిపై ఎస్.కోట రూరల్ సీఐ అప్పలనాయుడు పర్యవేక్షణలో ఎల్.కోట ఎస్‌ఐ నవీన్ పడాల్ శుక్రవారం రాత్రి సంఘటనా స్థలానికి చేరుకుని సంఘటనపై ఆరా తీశారు. శనివారం దాడికి పాల్పడిన మణికంఠను అదుపులోకి తీసుకుని ఎల్.కోట ఎస్‌ఐ నవీన్ పడాల్ కేసు నమోదు చేసి కోర్టుకు తరలించినట్టు చెప్పారు.

జూలై 1న జాతీయ వైద్యుల దినోత్సవం