
న్యాయం చేయండి బాబూ..!
ఎస్.కోట: జిందాల్ కోసం భూములు కోల్పోయాం.. ఏళ్లు గడిచినా మాకు న్యాయం జరడంలేదు.. పిల్లలకు ఉద్యోగాలు లేవు.. పరిహారం పూర్తిస్థాయిలో అందలేదు.. ప్రస్తుత ధరల ప్రకారం పరిహారం అందజేసే దారి కనిపించడం లేదు.. మా సమస్యపై శాంతియుతంగా నిరసన దీక్షలు చేస్తామంటే అనుమతులు లేవంటూ అడ్డగోలు నిబంధనలు విధిస్తున్నారని పలువురు మహిళలు మీడియా ముందు గురువారం వాపోయారు. మాగోడు ఎవరికి చెప్పాలంటూ స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆవేదన వ్యక్తంచేశారు. కంపెనీలు రావాలి.. కావాలి అంటూ బిర్యానీలు తింటూ నిరసన తెలిపేవారికి అనుమతులు ఉన్నాయట.. మా కుటుంబాల ఆకలి కేకలు వినిపించేందుకు అనుమతులు తెచ్చుకోవాలట.. ఇదెక్కడి న్యాయం ‘బాబూ’ అంటూ కన్నీటిపర్యంతమయ్యారు. నిరసన శిబిరం నిర్వహించేందుకు అనుమతివ్వాలని ఎస్.కోట సీఐ నారాయణమూర్తికి విజ్ఞప్తిచేస్తే, రెవెన్యూ అధికారులను అడగాలని కసురుకున్నారన్నారు. ఇక్కడికి వచ్చి తహసీల్దార్ శ్రీనివాసరావుకు మా గోడు చెబితే అంతా ఆలకించిన ఆయన మీకు పర్మిషన్ ఇచ్చే అధికారం నాకు లేదమ్మా అంటూ పంపించేశారన్నారు. మా భూముల్లో చెట్ల తొలగింపునకు అనుమతులు ఎవరిచ్చారో చెప్పాలన్నారు. పేదవారిని ఏం చేసినా అడిగేవారు లేరనే అధికారంతో మా జీవితాలను నాశనం చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఇప్పటికై నా ప్రభుత్వ పెద్దలు వాస్తవాలు తెలుసుకోవాలని, దళారీల మాటలు నమ్మి అమ్ముడుపోవద్దని విజ్ఞప్తిచేశారు.