
కబడ్డీ క్రీడాకారులకు ప్రోత్సాహం..
పాలకొండ: కబడ్డీ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకుంటున్నామని కబడ్డీ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షురాలు కె. ప్రభావతి అన్నారు. పాలకొండలో అండర్ –18 కబడ్డీ జట్టు క్రీడాకారుల ఎంపిక ఆదివారం చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కబడ్డీలో మన రాష్ట్రం నుంచి ప్రాతినిథ్యం వహించే వారి సంఖ్య తక్కువగా ఉంందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిభ కలిగిన వారు మన రాష్ట్రంలోనే ఎక్కువగా ఉన్నారని తెలిపారు. వీరిని ప్రోత్సహించేందుకు అసోసియేషన్ కృషి చేస్తుందని తెలిపారు.
14 మంది క్రీడాకారులు ఎంపిక
ఈ నెల 27 నుంచి హరిద్వార్‌లో జరగనున్న అండర్ 18 కబడ్డీ జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనే క్రీడాకారులను ఎంపిక చేశారు. 10 రోజులుగా పట్టణంలో జిల్లా కబడ్డీ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు పల్లా కొండలరావు సహకారంతో క్రీడాకారులకు శిక్షణ అందించారు. రాష్ట్రంలోని పలు జిల్లాలకు చెందిన 20 మంది క్రీడాకారులు శిక్షణ పొందారు. వీరిలో 14 మందిని జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక చేశారు. ఇందుకోసం ప్రభావతితో పాటు అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి వై. శ్రీకాంత్, వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ ఎన్. అప్పారావు క్రీడాకారులకు పోటీలు నిర్వహించి జట్టును ప్రకటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో అసోసియేషన్ నాయకులు సబ్బరాజు, నాంచారయ్య, రాంబాబు, సుధాకర్ మాట్లాడుతూ.. కబడ్డీ క్రీడాకారులకు పలు సూచనలు అందించారు. పది రోజుల పాటు ఉచిత భోజనం, వసతి కల్పించిన పల్లా కొండలరావుకు అసోసియేషన్ సభ్యులు, క్రీడాకారులు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం జిల్లా అసోయేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర అసోషియేషన్ నాయకులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో సీఎల్ నాయుడు, వి. చంద్రశేఖర్, గార లక్ష్మణ్, కె. రమేష్, పలువురు మాజీ క్రీడాకారులు పాల్గొన్నారు.

కబడ్డీ క్రీడాకారులకు ప్రోత్సాహం..