వేసవిలో కూల్‌.. కూల్‌.. | Sakshi
Sakshi News home page

వేసవిలో కూల్‌.. కూల్‌..

Published Mon, May 20 2024 12:45 AM

వేసవి

పుచ్చకాయల్లో పోషక గుణాలు

వేసవి తాపం నుంచి ఉపశమనం

పార్వతీపురం: మండుటెండల్లో ప్రయాణించే వారు పుచ్చకాయ ముక్క తింటే ఆ హాయి మాటల్లో వర్ణించలేనిది. ఎర్రగా నోరూరించే పుచ్చకాయ అంటే ఇష్టపడని వారు ఎవ్వరూ ఉండరనే చెప్పాలి. ఎండలు ముదురుతున్న నేపథ్యంలో గ్రామాల్లో, ప్రధాన రహదారుల్లో, చెట్లకింద పుచ్చకాయల వ్యాపారం జోరందుకుంది. ఈ ఏడాది పుచ్చకాయల ధర కాస్త ఎక్కువుగానే ఉంది. గతేడాది టన్ను పుచ్చకాయ రూ.10 వేల నుంచి 11 వేల రూపాయలు పలికింది. ప్రస్తుతం టన్ను రూ. 14 వేల నుంచి 15 వేల రూపాయల వరకు పలుకుతోంది. ఇది కాస్తా మరింత పెరిగే అవకాశం ఉందని సమాచారం. విజయనగరం జిల్లాలో పుచ్చకాయల సాగు తక్కువుగా ఉంది. దీంతో విశాఖ, పశ్చిమ గోదావరి, కడప, ఖమ్మం, శ్రీకాకుళం, తదితర ప్రాంతాలనుంచి దిగుమతి చేసుకుంటున్నట్లు వ్యాపారులు చెబుతున్నారు.

పెరుగుతున్న దుకాణాలు..

వేసవి ఎండలు ముదురుతుండడంతో పుచ్చకాయల దుకాణాలను విరివిగా ఏర్పాటు చేస్తున్నారు. ఇతర ప్రాంతాల నుంచి పుచ్చకాయలను దిగుమతి చేసుకొని గ్రామాల్లోను, ప్రధాన మార్గాల్లో విక్రయిస్తున్నారు. కాయలు కిలోల వంతున నేరుగా విక్రయించడంతో పాటు ముక్కలుగా కోసి ఒక్కో ముక్క పది రూపాయలు చొప్పున అమ్ముతున్నారు. కొందరు చిన్న చిన్న ముక్కలుగా కోసి కప్పుల్లో వేసి ఉప్పు, కారం వేసి విక్రయిస్తుండగా.. మరి కొంతమంది జ్యూస్‌ తీసి మరీ విక్రయిస్తున్నారు. ఆయా మార్గాల్లో రాకపోకలు సాగించే ప్రయాణికులు పుచ్చకాయ ముక్కలు తిని వేడి నుంచి ఉపశమనం పొందుతున్నారు. పుచ్చకాయలు వారం, పది రోజుల పాటు నిల్వ ఉండే అవకాశం ఉండడంతో వ్యాపారులు లారీల లెక్కన దిగుమతి చేసుకుని విక్రయాలు సాగిస్తున్నారు. సుగర్‌ బేబీ (మహారాష్ట్ర సాగయ్యే రకం), నాన్‌దారి (మన రాష్ట్రంలో సాగు చేసే ఓ రకం), ఆర్క్‌మెన్‌, మధుబాల, తదితర రకాల కాయలకే డిమాండ్‌ ఎక్కువగా ఉందని వ్యాపారులు చెబుతున్నారు.

విలువైన పోషకాలు

పుచ్చలో విటమిన్‌ బి, పొటాషియం, ఎలక్ట్రోలైట్లు పుష్కలంగా ఉంటాయి. కొలస్ట్రాల్‌ ఉండదు. వీటి వల్ల నిస్తేజితమైన శరీరానికి కొత్త శక్తి లభిస్తుంది. పుచ్చకాయలో 92 శాతం ఆల్క్‌లైన్‌తో పాటు పీచు పదార్థం ఉండడం వల్ల శరీరానికి, మూత్రపిండాలకు, మూత్రనాళాలకు ఎంతో ఉపయోగకరం. పుచ్చకాయ తినడం వల్ల మలబద్ధకం నివారించబడుతుంది. ఇందులో ఉండే పీటా కెరోటిన్‌ రోగ నిరోధకశక్తిని పెంచుతుంది. వృద్ధాప్యంలో వచ్చే అంధత్వ సమస్యను నివారిస్తుంది. అలాగే ఆస్తమా, మధుమేహం, ఆర్థరైటీస్‌ సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. రక్తప్రసరణ సక్రమంగా జరిగేలా చేస్తుంది. ఇదిలా ఉంటే పుచ్చకాయ సౌందర్య సాధనంగా కూడా ఉపకరిస్తుంది. 100 గ్రాముల పుచ్చకాయలో 91.45 గ్రాముల నీరు, 6 శాతం చక్కెర , 30 క్యాలరీల శక్తి, 7.6 గ్రాముల పిండి పదార్ధాలు, 0.6 గ్రాముల మాంసకృత్తులు, 12 గ్రాముల పొటాషియం, 7 గ్రాముల కాల్షియం, మిల్లీగ్రామ్‌ సోడియం చొప్పున ఉంటాయి.

సామాన్యులకు అందుబాటులో

వేసవిలో దాహర్తిని తీర్చుకోనేందుకు సామాన్యులకు సైతం పుచ్చకాయలు అందుబాటులో ఉంటున్నాయి. వేసవి తీవ్రతను తట్టుకొనేందుకు పుచ్చకాయలు ఎంతో ఉపయోగపడతాయి. తక్కువ ధరకే విలువైన పోషకాలున్న పండు లభిస్తుండడం అదృష్టం

– బి.పకీరునాయుడు, వల్లరగుడబ

ధరలు ఎక్కువ..

సీజన్‌ ప్రారంభం కావడంతో పాటు పంట తక్కువ కావడంతో పుచ్చకాయ ధర మార్కెట్‌లో అధికంగానే ఉంది. ప్రస్తుతం వ్యాపారం బాగానే ఉంది. మరికొద్ది రోజులు ఎండలు ఎక్కువగా ఉంటాయన్న సమాచారం ఉండడంతో వ్యాపారం మరింత జోరందుకొనే అవకాశం ఉంది.

– పి.లీలాకుమార్‌, వ్యాపారి, విశాఖపట్నం.

వేసవిలో కూల్‌.. కూల్‌..
1/1

వేసవిలో కూల్‌.. కూల్‌..

Advertisement
 
Advertisement
 
Advertisement