
సూర్యనమస్కారాల పూజలు చేయించుకుంటున్న భక్తులు
అరసవల్లి: అరసవల్లి శ్రీసూర్యనారాయణని ఆదివారం పెద్ద ఎత్తున భక్తులు దర్శించుకున్నారు. ఇతర ప్రాంతాల నుంచి ఈ క్షేత్రానికి తరలిరావడంతో ఆలయ పరిసరాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. ఆలయ ఈఓ వి.హరిసూర్యప్రకాష్ ఆధ్వర్యంలో భక్తుల దర్శనాలకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టారు. అయితే ఆదివారం భానుడి తీవ్రత అధికంగా ఉండడంతో ఒకింత ఇక్కట్లు పడ్డారు. ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకరశర్మ ఆధ్వర్యంలో ఆదిత్యుని మూర్తికి ప్రత్యేక అలంకరణ చేసి ఉదయం 6 గంటల నుంచి సర్వదర్శనాలకు అనుమతిచ్చారు. వివిధ టిక్కెట్ల ద్వారా దర్శనాలకు, అలాగే ఆలయంలోపల మండపాల్లో ప్రత్యేక సూర్యనమస్కార పూజలకు ఆలయ ఈవో వి.హరిసూర్యప్రకాష్ తగిన చర్యలు చేపట్టారు. దర్శనానికి వచ్చిన భక్తులకు ఉచిత ప్రసాదాలను పంపిణీ చేశారు. ఆదివారం ఎలాంటి ఆర్జిత సేవలను నిర్వహించలేదు. ఇక ఆదివారం ఒక్కరోజున దర్శనాల టిక్కెట్ల ద్వారా రూ.2.24 లక్షలు, విరాళాల ద్వారా రూ.74,186, ప్రసాదాల రూపంలో రూ.2.10 లక్షల వరకు ఆదాయం లభించిందని ఈఓ హరిసూర్యప్రకాష్ తెలియజేశారు. ఆదిత్యుడిని జిల్లా విజిలెన్స్ విభాగ ఎస్పీ ఎ.సురేష్‌బాబు, టెక్కలి జెడ్పీటిసీ దువ్వాడ వాణి తదితరులు స్వామిని దర్శించుకున్నారు.
కొట్లాటపై కేసు నమోదు
రణస్థలం: మండలంలోని కొచ్చెర్ల గ్రామంలో ముగ్గరు వ్యక్తులు గొడవ పడగా.. దీనిపై పోలీసు కేసు నమోదైందని ఎస్‌ఐ జి.రాజేష్ తెలిపారు. గ్రామానికి చెందిన బస్వ గౌరీశంకర్, దారపు నీలయ్య, తాత అనే వ్యక్తుల మధ్య రహదారి సమస్య నలుగుతోంది. ఏడాదిగా దీనిపై వారు గొడవ పడుతున్నారు. ఆదివారం ముగ్గురి మధ్య మాటలు ముదిరి ఘర్షణ జరిగింది. ఈ గొడవలో గౌరీశంకర్ అనే వ్యక్తి నీలయ్య, తాతలను తీవ్రంగా కొట్టి గాయపరిచాడు. వీరిని శ్రీకాకుళం రిమ్స్‌లో చేర్పించారు.