ప్రేమ, పోరాటాల కలబోతే ‘మోగ్లీ’
డాబాగార్డెన్స్: ‘కలర్ ఫొటో’ ఫేం దర్శకుడు సందీప్ రాజ్ తెరకెక్కించిన ‘మోగ్లీ’చిత్ర బృందం బుధవారం నగరంలో సందడి చేసింది. ఈ నెల 12న సినిమా విడుదల కానున్న నేపథ్యంలో... హీరో హీరోయిన్లు రోషన్ కనకాల, సాక్షి, నటుడు హర్ష నగరంలోని ఓ ప్రైవేట్ హాల్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హీరో మాట్లాడుతూ.. ప్రేమలోని నూతన కోణాన్ని ఈ చిత్రంలో చూపిస్తున్నట్లు తెలిపారు. ‘మోగ్లీ ఒక వైవిధ్యమైన చిత్రం. నా పాత్ర కోసం చాలా పరిశోధన చేశాను. ఈ కథ ప్రేక్షకులను తమ మొదటి ప్రేమ జ్ఞాపకాలకు తీసుకెళ్తుంది. దర్శకుడు సందీప్ రాజ్ విజన్ అద్భుతం. సినిమా విజయంపై చాలా నమ్మకంతో ఉన్నాం.’అని తెలిపారు. విశాఖపట్నం, పాడేరు, పార్వతీపురం పరిసర ప్రాంతాల్లోనే ఎక్కువగా షూటింగ్ జరిగిందని, ఈ సినిమాలో హర్ష కామెడీ, కాలభైరవ సంగీతం హైలైట్‌గా నిలుస్తాయని పేర్కొన్నారు. ఇదొక ప్రేమ యుద్ధమని, ప్రతి ఒక్కరూ థియేటర్‌లో ఈ సినిమా చూసి ఆదరించాలని విజ్ఞప్తి చేశారు. హీరోయిన్ మాట్లాడుతూ.. విశాఖపట్నం అంటే తనకు ఎంతో ఇష్టమని, మోగ్లీ ప్రమోషన్స్ ఇక్కడ మొదలవ్వడం సంతోషంగా ఉందని తెలిపారు. ‘ఈ సినిమాలో నాది మాట్లాడలేని, వినపడని అమ్మాయి పాత్ర. మాటలు లేకపోయినా, కళ్లతోనే భావాలు పలికించాల్సి వచ్చింది. ఇది నాకు చాలా చాలెంజింగ్ రోల్. రోషన్, సందీప్ చాలా సహకరించారు.’ అని పేర్కొన్నారు.


