
పుస్తకాల దందాను సహించేది లేదు
తాండూరు టౌన్: ప్రైవేటు స్కూళ్లలో పాఠ్య పుస్తకాల దందాను సహించేది లేదని ఎంఈఓ వెంకటయ్యగౌడ్ హెచ్చరించారు. పట్టణంలోని ఓ కార్పొరేట్ పాఠశాలలో పుస్తకాలు, నోటుబుక్కులతో పాటు స్టేషనరీ సామగ్రిని అధిక ధరలకు విక్రయిస్తున్నారని ఫిర్యాదు అందుకున్న ఆయన బుధవారం తనిఖీలు నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా నిల్వ చేసిన పుస్తకాల గదిని సీజ్ చేశారు. ప్రైవేటు స్కూళ్ల దోపిడీని అరికట్టాలని బీసీ జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు.
విద్యుదాఘాతంతో
గేదె మృతి
బొంరాస్‌పేట: మండల పరిధిలోని ఎన్కేపల్లిలో బుధవారం విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ వద్ద షాక్‌కు గురై పాడి గేదె మృతి చెందింది. గ్రామానికి చెందిన గొల్ల మల్లప్పకు చెందిన గేదె గడ్డి మేత మేస్తూ పొలంలో ఉన్న విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌కు తగిలి మృత్యువాత పడింది. రూ.1.50 లక్షలు నష్టపోయానని బాధితుడు వాపోయాడు.
స్కూల్ పిల్లలకు
తప్పిన ముప్పు
మొయినాబాద్: డ్రైవర్ నిర్లక్ష్యంతో స్కూల్ బస్సు పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ సంఘటన నాగిరెడ్డిగూడలో బుధవారం ఉదయం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మొయినాబాద్‌లోని ఓ కార్పొరేట్ స్కూల్ బస్సు బాకారం నుంచి పిల్లలను ఎక్కించుకుని నాగిరెడ్డిగూడ వెళ్తుండగా గ్రామ సమీపంలో రోడ్డు కిందికి దూసుకెళ్లింది. ఒకవైపు చక్రాలు పంటపొలంలోకి దూసుకెళ్లడంతో బస్సు ఆగిపోయింది. ఈ సమయంలో బస్సులో సుమారు 15 మంది విద్యార్థులు ఉన్నారు. ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో ప్రమాదం తప్పింది. డ్రైవర్ నిర్లక్ష్యంగా బస్సు నడపడంతోనే రోడ్డు కిందికి దూసుకెళ్లినట్లు ప్రత్యక్ష సాక్షులు మండిపడ్డారు. ఈ ఘటనపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. స్కూల్ బస్సులు వరుస ప్రమాదాల బారిన పడుతున్న నేపథ్యంలో వీటి ఫిట్‌నెస్‌పై తల్లిదండ్రులు అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. ఇప్పటికై నా సంబంధిత అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నారు.
కాడెద్దుల అపహరణ
నందిగామ: రోజంతా అరక కొట్టి రాత్రివేళ చెట్టుకింద కట్టేసిన కాడెద్దులు అపహరణకు గురైన సంఘటన నందిగామలో చోటు చేసుకుంది. ఎస్‌హెచ్‌ఓ ప్రసాద్ కథనం ప్రకారం.. స్థానికంగా ఉండే శివగళ్ల జంగయ్యకు గ్రామ శివారులోని జాతీయ రహదారి పక్కన వ్యవసాయ భూమి ఉంది. సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు పొలంలో తన ఎద్దులతో అరక తోలాడు. రాత్రి ఎప్పటిలాగే పొలం వద్ద ఓ చెట్టుకు ఎద్దులను కట్టేసి ఇంటికి వెళ్లిపోయాడు. మంగళవారం ఉదయం వచ్చి చూసే సరికి అవి కనపడలేదు. దీంతో తెలిసిన వారి వద్ద, పరిసర గ్రామాలలో ఎంత వెతికినా జాడ కనపడలేదు. దీంతో పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించి ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్ ప్రసాద్ తెలిపారు. ఎద్దుల విలువ సుమారు రూ.లక్ష యాభై వేలు ఉంటుందని వాపోయాడు.

పుస్తకాల దందాను సహించేది లేదు

పుస్తకాల దందాను సహించేది లేదు