
కొనసాగుతున్న ఉచిత కరాటే శిబిరం
ఆసక్తి చూపిస్తున్న విద్యార్థులు
అనంతగిరి: వికారాబాద్ పట్టణంలోని మేరినాట్స్ గ్రౌండ్‌లో సమ్మర్ ఫ్రీ కరాటే శిక్షణ తరగతులు కొనసాగుతున్నాయి. ఈ తరగతులు మాస్టర్ జపాన్ షోటోకాన్ కరాటే అసోసియేషన్‌న్‌ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఉదయం 6గంటల నుంచి 8వరకు రెండు గంటలు నిర్వహిస్తున్నారు. గత నెల 26న ప్రారంభమైన ఈ శిబిరం మే 26 వరకు కొనసాగుతుందని నిర్వాహకుడు యండీ ఖాజాపాషా మాస్టర్ తెలిపారు. ఆయన సమ్మర్ ఉచిత శిక్షణ శిబిరాలు 15సంవత్సరాలనుంచి చేపడుతున్నట్లు తెలిపారు. తన శిష్య బృందంతో ఈ తరగతులు నిర్వహిస్తున్నారని, విద్యార్థులు, వారి తల్లిదండ్రుల నుంచి మంచి స్పందన ఉందన్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న శిబిరంలో 215మంది విద్యార్థులు శిక్షణ తీసుకుంటున్నారన్నారు. ఈ క్యాంపులో శిక్షణ పొందే వారు అమ్మాయిలే అధికంగా ఉన్నారు. శిక్షణ శిబిరంలో కరాటే, సెల్ప్ డిఫెన్స్, ఫిజికల్ ఫిట్‌నెస్, ఓరియల్ వెపన్, జిమ్నాస్టిక్, జూడో తదితర వాటిలో తర్ఫీదు ఇస్తున్నామని శిక్షకులు తెలిపారు. అనంతరం ఆసక్తి, ప్రతిభ గల విద్యార్థులను రాష్ట్ర, జాతీయ పోటీలకు సైతం శిక్షణ ఇచ్చి పోటీలకు సన్నద్ధం చేస్తామని చెబుతున్నారు. నిర్వాహకుడు మాస్టర్ యండీ ఖాజాపాషాతో పాటు అతని బృందం బ్లాక్ బెల్ట్ హోల్డర్స్ డి. విజయ్, మాణిక్‌నాయక్, మధు మోహన్, ప్రజ్వల్‌కుమార్ తదితరుల ఆధ్వర్యంలో క్యాంపు కొనసాగిస్తున్నారు. కరాటేతో విద్యార్థులకు అనేక ఉపయోగాలు ఉన్నాయని, ఉచితంగా శిక్షణ ఇవ్వడం గొప్ప విషయమని మాస్టర్ ఖాజాపాషాను తల్లిదండ్రులు, విద్యార్థులు, క్రీడాభిమానులు అభినందిస్తున్నారు.