అదాని.. మోదీ బినామీ | - | Sakshi
Sakshi News home page

అదాని.. మోదీ బినామీ

Mar 31 2023 6:04 AM | Updated on Mar 31 2023 6:04 AM

టంగటూరు–మోకిల మధ్య వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేస్తున్న మంత్రి ప్రశాంత్‌రెడ్డి   - Sakshi

టంగటూరు–మోకిల మధ్య వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేస్తున్న మంత్రి ప్రశాంత్‌రెడ్డి

శంకర్‌పల్లి: ప్రపంచంలోనే అత్యంత అవినీతిపరుడు ప్రధాని నరేంద్ర మోదీ అని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ఆరోపించారు. దేశాన్ని దోచిపెట్టి అదానికి కట్టబెడుతున్నారని, అదాని మోదీ బినామీ అని దుయ్యబట్టారు. గురువారం శంకర్‌పల్లి మండలం టంగటూరు–మోకిల గ్రామాల మధ్య మూసీవాగుపై రూ.12.90 కోట్ల వ్యయంతో నిర్మించతలపెట్టిన వంతెన నిర్మాణం పనులను ఆయన శంకుస్థాపన చేశారు. అలాగే.. టంగటూరులో అదనపు తరగతి గదులను, రూ.90లక్షలతో నిర్మించిన పంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఒకప్పుడు అదాని ఆస్తులు రూ.50వేల కోట్లుంటే.. ప్రస్తుతం 12లక్షల కోట్లకు ఎలా ఎదిగాడని ప్రశ్నించారు. బీజేపీకి వ్యతిరేకంగా పోరాడే నాయకులను వ్యవస్థలను అడ్డుపెట్టుకొని వేధిస్తున్నారని విమర్శించారు. ఇటీవల మొయినాబాద్‌ మండలంలో నలుగురు ఎమ్మెల్యేల కొనుగోలుకు బీజేపీ చేసిన ప్రయత్నం బెడిసికొట్టిందని, తమ బండారం బయటపడినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌పై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఇందులో భాగంగానే ఎమ్మెల్సీ కవితపై అనేక కేసులు పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ పార్లమెంట్‌ సభ్యత్వం రద్దు చేయడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తలాతోక లేకుండా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శం నిలుస్తోందన్నారు.

దేశాన్ని దోచి కార్పొరేట్‌ సంస్థలకు కట్టబెడుతున్న ప్రధాని

ప్రశ్నించేవారిని కేసులతో వేధింపులు

మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి

శంకర్‌పల్లిలో పలు అభివృద్ధి పనులుప్రారంభం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement