వ్యక్తిగత దూషణలు సహించం

మర్పల్లిలో మాట్లాడుతున్న బీఆర్‌ఎస్‌ నాయకులు - Sakshi

మర్పల్లి: ఎమ్మెల్యే ఆనంద్‌కు తొత్తులుగా మారిన కొంతమంది వ్యక్తులు తమను వ్యక్తిగతంగా దూషిస్తూ సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతున్నారని, ఇది ఎంతమాత్రం సరైంది కాదని మర్పల్లి మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌ రామేశ్వర్‌ అన్నారు. మండల కేంద్రంలోని ఎంసీఎం ఫంక్షన్‌ హాల్‌లో గురువారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సహకార సంఘం వైస్‌ చైర్మన్‌ ఫసీ, ఎంపీటీసీల ఫోరం మండల చైర్మన్‌ రవీందర్‌, మర్పల్లి మాజీ వైస్‌ ఎంపీపీ అంజయ్యగౌడ్‌, పంచలింగాల సర్పంచ్‌ సురేందర్‌రెడ్డి, దామస్తాపూర్‌ మాజీ సర్పంచ్‌ పాండురంగారెడ్డి తదితరులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ ఉద్యమ సమయంలో తాము చేసిన పోరాటాలు ఎమ్మెల్యే అనుచరులకు తెలియనివి కావన్నారు. తన విజయం కోసం కృషి చేసిన సీనియర్లను ఎమ్మెల్యే పక్కన పెట్టారని, వారిని అవమానాలకు గురిచేస్తున్న విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. పార్టీ ఆవిర్భావం నుంచి టీఆర్‌ఎస్‌ జెండాలు మోసిన వారికి, సీఎం కేసీఆర్‌ అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్న వారికి కనీస గౌరవం దక్కడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. ఎమ్మెల్యే ఆనంద్‌ మండలానికి వచ్చినప్పుడు తమకు కనీస సమాచారం కూడా ఇవ్వడం లేదని ఆరోపించారు. అందరికీ నాయకుడిలా ఉండాల్సిన ఎమ్మెల్యే కొందరికే ప్రాధాన్యం ఇస్తే నష్టం ఎవరికో ఆయనే గుర్తించాలన్నారు. దళితుల అభ్యున్నతి కోసం కేసీఆర్‌ ప్రవేశపెట్టిన దళితబంధు పథకాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. కొంత మంది సర్పంచ్‌లు ఇతర పార్టీలకు చెందిన దళితుల నుంచి కమీషన్లు తీసుకుని రెండో విడత కోసం పేర్లు నమోదు చేసుకోవడం ఏమిటని ప్రశ్నించారు. ఇలాంటి వ్యవహారాలతో బీఆర్‌ఎస్‌కు నష్టం వాటిల్లుతుందని తెలిపారు. ఉద్యమకారులను విస్మరించిన ఎమ్మెల్యే గ్రూపులను ప్రోత్సహించేలా వ్యవరిస్తున్నారని ఆరోపించారు. ఇకముందు ఎమ్మెల్యే అనుచరులు తమపై కానీ తమ మద్దతుదారులపై కానీ సోషల్‌ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఎమ్మెల్యే ఆనంద్‌ ఇప్పటికై నా అందరినీ కలుపుకొని వెళ్లాలని, లేదంటే వచ్చే ఎన్నికల్లో మూల్యం చెల్లించక తప్పదని హితవు పలికారు. గత ఎన్నికల్లో తాను ఎమ్మెల్యే ఆనంద్‌ గెలుపుకోసం పనిచేయలేదని తెలిసి కూడా తనను పార్టీలోకి తీసుకుని, మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌ పదవిని కట్టబెట్టారన్నారు. ఈవిషయాలన్నీ మర్చిపోయి తమను అవమానాలకు గురిచేస్తే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఎమ్మెల్యే ఆదేశిస్తే తాను వెంటనే పదవిని వదిలేస్తానని, కేవలం పార్టీ కార్యకర్తగా మాత్రమే పనిచేస్తానని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్‌ కమిటీ డైరెక్టర్‌ అనంత్‌రెడ్డి, పంచలింగాల మాజీ సర్పంచ్‌ సురేష్‌, యాదవరెడ్డి, వెంకట్‌రెడ్డి, రవీందర్‌రెడ్డి, రవి, ఘణాపూర్‌ శంకర్‌, పట్లూర్‌ చౌకత్‌, రాములు, రథన్‌ తదితరులు ఉన్నారు.

పార్టీ సీనియర్లను అవమానించడం సరికాదు

ఎమ్మెల్యే ఆనంద్‌, ఆయన తొత్తుల తీరు మారాలి

లేదంటే వచ్చే ఎన్నికల్లో నష్టం తప్పదు

గ్రూపు తగాదాలను ప్రోత్సహిస్తే బీఆర్‌ఎస్‌ను బలహీనపర్చినట్లే

మర్పల్లి మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌ రామేశ్వర్‌

Read latest Vikarabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top