పెరిగిన కూలి.. మెరుగైన ఉపాధి

ఉపాధి పనులు చేస్తున్న కూలీలు (ఫైల్‌)  - Sakshi

అనంతగిరి: ఉపాధి హామీ పథకం కింద పనిచేసే కూలీలకు రోజువారి కూలి పెరిగింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ పెంపు నిర్ణయంతో కూలీలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇదివరకు కూలి రూ.257 ఉంది. ప్రస్తుతం రూ.15 పెంచడంతో రూ.272 చేరుకుంది. పూర్తి కూలి పొందాలంటే నిర్దిష్ట పని కొలతలకు తగ్గట్టుగా పని చేయాల్సి ఉంటుంది.

కొత్త పనులు ప్రారంభం

2023–24 ఉపాధి కూలీల కొత్త పనులు శనివారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్‌ 1నుంచి జూన్‌ మొదటి వారం వరకు గ్రామాల్లో ఉపాధి పనులు జోరుగా కొనసాగుతుంటాయి. ప్రతి యేటా జాబ్‌కార్డుపై వంద రోజుల పని కల్పిస్తున్నారు. ఇందులో దాదాపుగా ఏప్రిల్‌, మే నెలల్లోనే తమ పనిదినాలను పూర్తి చేస్తుంటారు. ఈ సారి కలెక్టర్‌ నారాయణరెడ్డి ఉపాధి పనులపై ప్రత్యేక శ్రద్ధ చూపుతూ సంబంధిత అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఉపాధి పనులు పూర్తి చేయడం, కూలీలకు ఉపాధి కల్పించడం, గ్రామాల అభివృద్ధికి దోహదం చేయడం వంటి ప్రక్రియలో ఆయన పలుమార్లు సంబంధిత అఽధికారులతో సమీక్షలు నిర్వహించారు. కొత్త పనుల్లో భాగంగా పొలాల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా బాటలు వేయడం, చెక్‌డ్యాంలలో, చెరువుల్లో పూడికతీత, పొలాల మధ్య కాల్వలు, లేవలింగ్‌ తదితర పనులకు ప్రత్యేక దృష్టి సారించారు. ఈ కోణంలోనే ఇప్పటికే ఉపాధిహామీ ఏపీఓ, టీఏ, ఈసీ, ఎఫ్‌ఏలు పని వివరాలను సేకరించి పనులు మంజూరు కూడా తీసుకున్నారు. వికారాబాద్‌ మండలంలో మొత్తం జాబ్‌ కార్డులు 7,140 ఉండగా, ఇందులో 6,020 జాబ్‌కార్డులు ఆక్టివ్‌గా ఉన్నాయి. ప్రస్తుతం ఉపాధి హామీ పనులను క్షేత్రస్థాయిలో ఫీల్డ్‌ అసిస్టెంట్‌లు ఎన్‌ఎంఎంఎస్‌ యాప్‌లో ఫొటో క్యాప్చర్‌ చేయడం జరుగుతుంది. పని జరుగుతున్న ప్రారంభంలో ఒకసారి ఫొటో తీయాలి. పని అయ్యాక సైతం ఫొటో అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది.

ఎన్‌ఆర్‌ ఈజీఎస్‌ కూలీల్లో హర్షాతిరేకాలు

ఇదివరకు కూలి రూ.257

ప్రస్తుతం రూ.15 పెంపు

జాబ్‌కార్డులందరికీపని కల్పించేందుకు అధికారుల చర్యలు

ఉత్తర్వులు రాగానే అమలు

ప్రస్తుతం కొత్త పనులు ప్రారంభం అవుతున్నాయి. గ్రామాల్లో ఉపాధి కూలీలు టార్గెట్‌కు అనుగుణంగా పనులు చేపట్టాలి. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం రూ.15 కూలి పెంచినట్లు నిర్ణయించింది. పెరిగిన వేతనానికి సంబంధించిన ఉత్తర్వులు అందగానే అమలు చేస్తాం. నిర్దేశించిన లక్ష్యానికి అనుగణంగా పనిచేసి పూర్తి కూలి పొందాలని కోరుతున్నాం. గ్రామాల్లో ఉపాధి కార్డు ఉన్న ప్రతిఒక్కరూ పనికి రావాలిన కోరుతున్నాం.

– శీను, ఏపీఓ

Read latest Vikarabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top