యాచారం: ఉపాధ్యాయుల సమస్యలపై త్వరలో సీఎం కేసీఆర్‌ను కలిసి నివేదిస్తానని పీఆర్టీయూ టీఎస్ నేత గుర్రం చెన్నకేశవరెడ్డి అన్నారు. తన స్వగ్రామం మొండిగౌరెల్లిలో గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తన గెలుపు కోసం పీఆర్టీయూ టీఎస్ శ్రేణులు ఎంతగానో కష్టపడ్డారని తెలిపారు. తన ఓటమికి ఎన్నో కారణాలు ఉన్నాయని, వాటిపై పూర్తి స్థాయిలో సమీక్షించినట్టు చెప్పారు. పీఆర్టీయూ టీఎస్ నుంచి రెండుసార్లు గెలిచిన జనార్దన్‌రెడ్డి రెబల్‌గా మళ్లీ పోటీ చేసి ఓట్లు చీల్చడం, డబ్బు ప్రభావితం చేశాయన్నారు. అయినా ఆందోళన చెందడం లేదని, ఉపాధ్యాయుల సమస్యలే ప్రధాన ఎజెండాగా పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో సరైన సౌకర్యాలు లేక విద్యార్థులు, ఉపాధ్యాయులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించేలా కృషి చేస్తానని వివరించారు.