
విద్యుదాఘాతంతో వ్యక్తి దుర్మరణం
● సుపరిపాలన కార్యక్రమంలో ప్రమాదం
నాయుడుపేట టౌన్ : కూటమి ప్రభుత్వం సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమానికి షామియాన వేస్తున్న వ్యక్తి కందుకూరి మునీశ్వర్(45) విద్యుదాఘాతానికి గురై గురువారం మృత్యువాత పడ్డాడు. ఈ సంఘటన నాయుడుపేట పట్టణంలోని మహాలక్ష్మమ్మ నగర్‌లో చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన మేరకు వివరాలు.. తుమ్మూరుకు చెందిన మునీశ్వరయ్య అక్కడ హైరర్స్‌కు చెందిన యజమానికి స్నేహితుడు కావడంతో మహాలక్ష్మమ్మ నగర్‌లో జరిగే ప్రభుత్వ కార్యక్రమానికి షామియానా వేసేందుకు కార్మికులతో కలిసి వెళ్లాడు. లేదోటమ్మ ఆలయ సమీపంలో ఎమ్మెల్యే నిర్వహించే కార్యక్రమానికి షామియానా వేసే క్రమంలో విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే మృత్యువాత పడ్డాడు. అప్పటికీ స్థానికులు అతడిని ప్రైవేట్ అంబులెన్స్‌లో స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించి పరీక్షించగా అప్పటికే మృతి చెందినట్లుగా నిర్ధారించారు. సీఐ బాబి సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి మునీశ్వరయ్య మృతదేహానికి పోస్టుమార్టమ్ నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ప్రమాదానికి కారణం విద్యుత్ అధికారుల నిర్లక్ష్యమేనని మహాలక్ష్మమ్మ కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. మహా లక్ష్మమ్మ కాలనీలో విద్యుత్ వైర్లు ఇళ్లపైనే వేళాడుతూ.. చేతికందే ఎత్తులో ఉన్నాయని పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
కన్నీటి పర్యంతమైన కుటుంబ సభ్యులు
పేద కుటుంబానికి చెందిన మునీశ్వర్‌కు భార్య లలిత, రోహిణి, బిందు అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మునీశ్వర్ ఒక్కసారిగా విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందడంతో వారి బోరున విలపించారు. సంఘటన స్థలంతో పాటు వైద్యశాల వద్ద లే.. డాడి అంటూ కుమార్తెలు రోదించిన తీరును చూసి చలించిపోయారు.
అన్ని విధాలుగా ఆదుకుంటాం
ఎమ్మెల్యే విజయశ్రీ మాట్లాడుతూ.. ప్రమాదవశాత్తు మునీశ్వర్ మృతి చెందడం బాధాకరమని, ఆ కుటుంబాన్ని పార్టీ ఆదుకుంటుందని అంత్యక్రియల కోసం రూ 50 వేల నగదును కుటుంబ సభ్యులకు అందించారు. అదే విధంగా మృతుడి ఇద్దరు కుమార్తెలకు ప్రభుత్వ శాఖలలో ఉద్యోగం కల్పిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే వెంట మాజీ ఎంపీ నెలవల సుబ్రమణ్యం, మున్సిపల్ వైస్ చైర్మన్ రఫీ, నెలవల రాజేష్ తదితరులు ఉన్నారు.