
వీసీ కోసం వెతుకులాట!
● ఎస్వీయూ వైస్ చాన్సలర్ నియామకానికి సెర్చ్ కమిటీలు
తిరుపతి సిటీ : ఎస్వీయూ వీసీ నియామకంపై ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోంది. ఏడాదిగా పూర్తి స్థాయి వైస్ చాన్సలర్‌ను నియమించేందుకు ఇప్పటికే రెండు సార్లు సెర్చ్ కమిటీలను ఏర్పాటు చేసింది. ఇటీవల సమావేశమైన రెండో సెర్చ్ కమిటీ ఓ మంత్రి తోడల్లుడు సిఫార్సు చేసిన రెండు పేర్లతో పాటు ప్రస్తుత ఇన్‌చార్జి వీసీ పేరును ప్రతిపాదిస్తూ ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. దీనిపై తమ వారిని పక్కన పెట్టారని కూటమిలో భాగమైన ఓ ప్రధాన పార్టీ నేత మండిపడ్డట్టు సమాచారం. ఈక్రమంలో వీసీ నియామక ప్రక్రియ సందిగ్ధంలో పడింది. మొదటి, రెండో సెర్చ్ కమిటీ సమర్పించిన నివేదికలను రద్దు చేసి ప్రస్తుతం మరోసారి మూడో సెర్చ్ కమిటీని నియమించేందుకు ఉన్నత విద్యామండలి కసరత్తు ప్రాంభించినట్లు విశ్వసనీయ సమాచారం.
ఒత్తిడిలో కమిటీలు
ప్రధానంగా ఎస్వీయూ వీసీ నియామకంపై ఏర్పాటు చేసిన సెర్చ్ కమిటీలపై రాజకీయ ఒత్తిడి అధికంగా ఉన్నట్లు తెలిసింది. అందుకే సెర్చ్ కమిటీలో సభ్యులుగా తమను ఎంపిక చేయవద్దని పలువురు ఉన్నత విద్యామండలి అధికారులకు మొరపెట్టుకుంటున్నట్లు సమాచారం. ప్రతిభ, అనుభవం, సామాజిక వర్గ సమీకరణల ప్రాతిపదికన వీసీ నియామకానికి సమర్థులైన ముగ్గురు వ్యక్తులను సెర్చ్ కమిటీ ప్రతిపాదిస్తే వాటిని రద్దు చేయడం ఎంతవరకు సమంజసమని విద్యావంతులు, మేధావులు ప్రశ్నిస్తున్నారు. దీంతో ఇప్పట్లో ఎస్వీయూకు పూర్తి స్థాయి వీసీ నియామకం జరిగేలా లేదని పలువురు చర్చించుకుంటున్నారు.