
యూరియా.. ఏదయా..?
తిరుపతి అర్బన్ : కూటమి సర్కార్ ఏర్పడినప్పటి నుంచి రైతులను పట్టించుకోవడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పెట్టుబడి సాయంగా అందించాల్సిన అన్నదాతా సుఖీభవ నిధుల సంగతి దేముడెరుగు, కనీసం సబ్సిడీ విత్తనాలు, పనిముట్లు సంగతి నామమాత్రమేనని చర్చ సాగుతోంది. ముఖ్యంగా రైతులకు ఎరువులు అందించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ సీజన్‌లో జిల్లావ్యాప్తంగా రైతులు 80వేల ఎకరాల్లో వరి పంట సాగు చేపట్టారు. ఇందుకోసం 35వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరముంది. అయితే వ్యవసాయశాఖ అధికారులు ఈ సీజన్‌లో ఇప్పటి వరకు కేవలం 7,500 మెట్రిక్ టన్నుల యూరియాను అందించినట్లు చెబుతున్నారు. రైతులకు 27,500 మెట్రిక్ టన్నుల యూరియా ఇంకా కావాల్సి ఉంది. ఈక్రమంలో ప్రైవేటు వ్యాపారులు 17,500 మెట్రిక్ టన్నులు విక్రయించినట్లు తెలుస్తుంది. అయినప్పటికి మరో 10వేల మెట్రిక్ టన్నులు యూరియా అన్నదాతలకు అవసరమవుతోంది. ఈ సీజన్‌లో పంట చివరి దశకు చేరుకుంది. ఈ సమయంలో పంటకు వేయాల్సిన యూరియా కోసం రైతులు నానా తిప్పలు పడుతున్నారు. సాధారణంగా యూరియా బస్తా రూ. 266.50కి విక్రయించాల్సి ఉంది. అయితే కొందరు ప్రైవేటు వ్యాపారులు సిండికేట్‌గా మారి, బస్తా యూరియాను రూ. 285 నుంచి రూ.300లకు విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది.