
అకడమిక్ కన్సల్టెంట్ల పనితీరుపై సమీక్ష
తిరుపతి సిటీ: ఎస్వీయూ అకడమిక్ కన్సల్టెంట్ల పనితీరుపై సమీక్ష పేరుతో చేపట్టిన ఇంటర్వ్యూలు అగ్ని పరీక్షలుగా మారాయి. గత విద్యా సంవత్సరంలో అకడమిక్ కన్సల్టెంట్లు, కో–ఆర్డినేటర్ల పనితీరుపై వీసీ చాంబర్‌లో మంగళవారం నుంచి ప్రారంభమైన ఇంటర్వ్యూలకు వీసీ, రిజిస్ట్రార్‌తో పాటు పలు విభాగాల అధ్యక్షులు హాజరయ్యారు. సంబంధిత సబ్జెక్ట్‌లో కమిటీ సంధించిన ప్రశ్నలకు అకడమిక్ కన్సల్టెంట్లు వైట్‌బోర్డ్‌పై డెమో ఇచ్చారు. తొలిరోజు పలు విభాగాల్లో పనిచేస్తున్న 43మంది తాత్కాలిక అధ్యాపకులు ఇంటర్వ్యూలకు హాజరై పనితీరు పరీక్షను ఎదుర్కొన్నారు. అయితే ఎస్వీయూలో గతంలో ఎన్నడూ లేనివిధంగా తాత్కాలిక అధ్యాపకులకు ఇంటర్వ్యూలు నిర్వహించడం బాధాకరమని వారు వాపోతున్నారు. ఫర్ఫార్మెన్స్ రివ్యూ పేరుతో పెద్ద సంఖ్యలో అకడమిక్ కన్సల్టెంట్లను తొలగించే వ్యూహంలో భాగంగానే ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈనెల 5వ తేదీ వరకు కొనసాగనున్న ఈ ఇంటర్వ్యూలకు పలు విభాగాల నుంచి మరో 200మంది అకడమిక్ కన్సల్టెంట్లు హాజరుకానున్నారు.