
ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు
తిరుపతి ఎడ్యుకేషన్ : తిరుపతి ఎమ్మార్‌పల్లిలోని మోడల్ ప్రైమరీ స్కూల్ ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయులకు జిల్లా విద్యాశాఖాధికారి (డీఈఓ) కేవీఎన్.కుమార్ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఆయన మంగళవారం ఆ పాఠశాలను సందర్శించారు. ఆ పాఠశాల విద్యార్థుల అభ్యసనా సామర్థ్యాన్ని, పాఠశాల రికార్డులను పరిశీలించారు. హెచ్‌ఎం, ఇతర ఉపాధ్యాయులు గత ఏడాది కంటే తక్కువగా అడ్మిషన్లు చేయడం, ఒకటో తరగతి విద్యార్థుల వివరాలను యూడైస్‌లో నమోదు చేయడంలో హెచ్‌ఎం అలసత్వం వహించడం, తరగతుల వారీగా బోధనకు, మధ్యాహ్న భోజన పర్యవేక్షణకు ఉపాధ్యాయులను కేటాయించకపోవడం వంటి అంశాలను గుర్తించారు. దీంతో వివరణ కోరుతూ ఆ పాఠశాల హెచ్‌ఎం, ఉపాధ్యాయులకు షోకాజు నోటీసులు ఇచ్చినట్లు డీఈఓ తెలిపారు.