
ప్రాణహానీ ఉంది.. రక్షణ కల్పించండి.
రాష్ట్ర సంగీత నృత్య అకాడమీ మాజీ చైర్‌పర్సన్
సైదాపురం : అక్రమ మైనింగ్‌దారులతో తనకు ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలంటూ రాష్ట్ర సంగీత నృత్య అకాడమీ మాజీ చైర్‌పర్సన్ శిరీష యాదవ్ జిల్లా పోలీసు ఉన్నతాధికారులను కోరారు. శుక్రవారం ఆమె మాట్లాడుతూ.. సైదాపురం మండలంలో జరుగుతున్న అక్రమ మైనింగ్‌పై చర్యలు తీసుకోవాలంటూ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌కు తాము ఫిర్యాదు చేశామన్నారు. దీని దృష్టిలో ఉంచుకోని జిల్లా మైనింగ్ అధికారులతో పాటు అక్రమ మైనింగ్‌కు పాల్పడుతున్న కొందరు తమపై తప్పుడు కేసులతో పాటు ప్రాణహాని కలిగించేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు. అక్రమ మైనింగ్ చేసే వారి వల్ల తనకు ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలని ఉన్నతాధికారులను ఆమె కోరారు. జిల్లా ఎస్పీకి పత్రికా ముఖంగా విన్నవించుకుంటున్నట్లు ఆమె పేర్కొన్నారు.
ఏపీ టూరిజానికి భూ కేటాయింపు
● ఎస్వీపురం పరిధిలో 12.70 ఎకరాలకు ఆమోదం
తిరుపతి అన్నమయ్య సర్కిల్ : టూరిజం ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులను అభివృద్ధి చేసే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం తిరుపతి జిల్లాలో ఏపీ టూరిజం ఆథారిటీకి ఉచితంగా భూమి కేటాయింపునకు నిర్ణయం తీసుకుంది. వడమాలపేట మండలం ఎస్వీపురం పంచాయతీ పరిధిలో 12.70 ఎకరాల భూమిని అప్పగించేందుకు ఆమోద ముద్ర వేసింది. ఉచితంగా భూ కేటాయింపు ప్రతిపాదనపై మంత్రి వర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎస్వీపురం సర్వే నంబరు 428–2లో 30 సెంట్లు అలాగే సర్వే నంబరు 428–3లో 12.40 ఎకరాల చొప్పున ఏపీ టూరిజం అథారిటీకి భూమిని బదిలీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తిరుపతిలో 5 స్టార్ హోటల్ నిర్మాణానికి ముందుకొచ్చిన మెస్సర్స్ పావని హోటల్స్ సంస్థకు అవసరమైన రాయితీ ఇచ్చేందుకు చేసిన ప్రతిపాదనలపై మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ 5 స్టార్ హోటల్ ఏర్పాటుతో సుమారు 250 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నట్లు పర్యాటక రంగ శాఖ అధికార యంత్రాంగం భావిస్తోంది. అదే విధంగా మిల్క్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.