
తిరుపతి జిల్లాకు ఆదర్శం కావాలి
● వెబ్ ల్యాండ్, మ్యుటేషన్‌లు త్వరితగతిన పరిష్కరించండి ● రాష్ట్ర భూ పరిపాలన చీఫ్ కమిషనర్ జయలక్ష్మి
తిరుపతి అర్బన్ : తిరుపతి నగరం జిల్లాకు ఆదర్శం కావాలని రాష్ట్ర భూ పరిపాలన చీఫ్ కమిషనర్ జయలక్ష్మి వెల్లడించారు. శుక్రవారం ఆమె తిరుపతి అర్బన్ తహశీల్దార్ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వెబ్‌ల్యాండ్ ఆటోమేటిక్ రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్ సమస్యలతో పాటు రెవెన్యూ పరిధిలోని అన్ని అంశాలను ఎప్పటికప్పుడు పరిష్కరించే దిశగా పనిచేయాలని ఆదేశించారు. పుత్తూరు మండలంలోని మూడు గ్రామాలకు సంబంధించి ముగ్గురు వ్యక్తుల వెబ్‌ల్యాండ్ సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు. ఇదే తరహాలో అన్ని సమస్యలకు పరిష్కారం చూపాలని పేర్కొన్నారు. సాంకేతిక అంశాలపై రెవెన్యూ ఉద్యోగులు ముందుగా పట్టుసాధించాలని సూచించారు. తిరుపతి జిల్లా కేంద్రమైన అర్బన్‌లో రెవెన్యూ సమస్యలు లేకుండా చూడాల్సి ఉందన్నారు. జిల్లా కేంద్రం ఆదర్శంగా ఉంటే అన్ని మండలాలు అదే బాటలో నడుస్తాయని చెప్పారు. తిరుపతి అర్బన్ తహశీల్దార్ సురేష్‌బాబు, డిప్యూటీ తహశీల్దార్ కిరణ్, పుత్తూరు మండల తహశీల్దార్ జీసీ వెంకటేశ్వర్లు, డిప్యూటీ తహశీల్దార్ అశోక్‌రెడ్డి,పలువురు వీఆర్వోలు ఉన్నారు.