
● సత్యవేడులో చెలరేగిపోతున్న అక్రమార్కులు ● రోజూ వందల లా
వరదయ్యపాళెం : కూటమి ప్రభుత్వంలో మట్టి మాఫియా అడ్డూ అదుపు లేకుండా చెలరేగిపోతోంది. రెండు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతమైన సత్యవేడు కేంద్రంగా టీడీపీ కీలక నేతల కనుసన్నల్లో మాఫియా జోరుగా సాగుతోంది. కూటమి అధికారం చేపట్టిన నాటి నుంచి మొదలైన గ్రావెల్ అక్రమ రవాణా మూడు నెలలుగా ఊపందుకుంది. ప్రధానంగా సత్యవేడు, నాగలాపురం, వరదయ్యపాళెం మండలాల కేంద్రంగా గ్రావెల్ మాఫియా దందా సాగిస్తోంది. రోజువారీగా వందల టిప్పర్లు తమిళనాడు సరిహద్దు దాటిస్తూ సత్యవేడు ప్రాంత సంపదను దోచుకుంటున్నారు. కట్టడి చేయాల్సిన రెవెన్యూ, పోలీస్, మైన్స్ యంత్రాంగం అటువైపు కన్నెత్తి చూడకపోవడం విమర్శలకు తావిస్తోంది.
అధికార పార్టీ నేతల ఆగడాలు
ఏకంగా సత్యవేడు నియోజకవర్గం నాగలాపురం మండలంలోని రాజులకండ్రిగ వద్ద పెద్ద ఎత్తున మట్టిని తమిళనాడుకు తరలిస్తున్నారు. రోజువారీ వందల లారీలు రాజులకండ్రిగ నుంచి తమిళనాడుకు మట్టి తరలిస్తుండడంతో ఈ పరిణామాలను సాక్షాత్తు ఆ మండల టీడీపీ నేతలు వ్యతిరేకిస్తున్నారు. టీడీపీ జెండాలు పట్టుకుని మరి రాజులకండ్రిగ వద్ద జరుగుతున్న గ్రావెల్ అక్రమ రవాణా వద్ద తాజాగా 10 రోజుల క్రితం పెద్ద ఎత్తున నిరసనలు తెలపడం గమనార్హం. కూటమి ప్రభుత్వ ఆగడాలకు సొంత టీడీపీ పార్టీ నుంచే విమర్శలు వస్తున్నాయంటే మట్టి మాఫియా ఆగడాలు ఏమాత్రం ఉన్నాయో ఊహించవచ్చు.
తమిళనాడులో భలే గిరాకీ
సరిహద్దు ప్రాంతమైన సత్యవేడు రాష్ట్రం నుంచి తమిళనాడుకు తరలిస్తున్న ఎర్రమట్టికి తమిళనాడులో మంచి గిరాకీ ఉంది. 70 టన్నులు బరువుతో వెళ్లే టిప్పర్ లారీ రూ.40 వేలకు పైగా ధర పలుకుతోంది. దీంతో ఎక్కడ లేని గిరాకీ ఆంధ్రా మట్టికి నెలకొనడంతో టీడీపీ కీలక నేతలకు కాసుల వర్షం కురిపిస్తోంది.
తెలుగుగంగ అధికారుల నిర్లక్ష్యం
తెలుగు గంగ కాలువ గట్లను బహిరంగంగా గ్రావెల్ మాఫియా కొల్లగొడుతున్నప్పటికీ కాలువ పర్యవేక్షణ చేసే అధికారులు పత్తా లేకుండా పోయారు. అధికార టీడీపీ మాయలో పడిన వారు అటువైపు కన్నెత్తి చూడకపోవడం గమనార్హం. అధికారుల అలసత్వానికి భవిష్యత్తులో కాలువల నిర్వహణ ప్రశ్నార్థకం కానుంది. అధికారుల నిర్లక్ష్యంపై ప్రజలు మండిపడుతున్నారు.
అనుమతి పేరుతో దోపిడీ
తమిళనాడులో జరుగుతున్న అభివృద్ధి పనులకు ఆంధ్రా మట్టిని తరలించేందుకు టీడీపీ నేతలు అక్రమ అనుమతులు పొందుతున్నారు. తమిళనాడులోని పొన్నేరి, ఎన్నూరు పోర్టు, ఇతర ప్రాంతాల్లో జరిగే అభివృద్ధి పనులకు ఆంధ్రా మట్టిని తరలించేందుకు జిల్లాలోని మైన్స్ అధికారులు, కూటమి నేతల ఒత్తిళ్లకు లోనై గుడ్డిగా అనుమతులు ఇస్తుండడం స్థానిక ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అనుమతులు ఇచ్చేది గోరంతైతే తవ్వకాలు జరిపి తరలించేది కొండంత. దీంతో అక్రమ రవాణాకు అధికారులే గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం వెనుక అధికార టీడీపీ నేతలు కుమ్మకై ్క దోచేస్తున్నారు.
నన్నాపేదెవడ్రా?
శ్రీకాళహస్తి: మండలంలోని చుక్కలనిడిగల్లు గ్రామంలో మట్టిమాఫియా రెచ్చిపోతోంది. స్థానిక టీడీపీ నాయకుడి కనుసన్నల్లో మట్టి, ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. ఇతరులు ఎవరైనా ఇసుక, మట్టి ఎత్తితే పోలీసులకు చెప్పించి వారిని పట్టించేయడం రివాజుగా మారుతోంది. ఓ ప్రైవేటు వెంచర్ కోసం చుక్కలనిడిగల్లు చెరువులోని మట్టిని జేసీబీలతో తవ్వి నిరంతరాయంగా తరలిస్తున్నా అధికారులెవ్వరూ అటువైపు కన్నెత్తి చూడకపోవడం విమర్శలకు తావిస్తోంది. రోజుకు వంద నుంచి 150 ట్రిప్పుల మట్టి తరలిస్తున్నారు. దీనిపై స్థానికులు ప్రశ్నిస్తే తమకు అధికారులు, పెద్ద నాయకుల అండదండలు ఉన్నాయంటూ బెదిరింపులకు దిగుతున్నట్టు సమాచారం.

● సత్యవేడులో చెలరేగిపోతున్న అక్రమార్కులు ● రోజూ వందల లా