
అల్పాహారం తిని ప్రాణాపాయం
శ్రీకాళహస్తి : శ్రీకాళహస్తి బీసీ హాస్టల్‌లో మంగళవారం ఉదయం కలుషిత ఆహారం తిని 16మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. బాధితులను వెంటనే హాస్టల్ వార్డెన్ పట్టణంలోని ఏరియా ఆస్పత్రికి తరలించారు. వివరాలు.. ఏర్పేడు మండలం పాపానాయుడుపేటలోని బీసీ హాస్టల్‌ను శ్రీకాళహస్తికి తరలించారు. అయితే నాలుగురోజుల క్రితం జరిగిన బదిలీల్లో భాగంగా రేణిగుంట హాస్టల్ వార్డెన్ వెంకటేవ్వర్లుకు ఈ వసతిగృహం బాధ్యతలు అప్పగించారు. ఆయన మంగళవారం ఉదయం హాస్టల్‌కు వచ్చి విద్యార్థులతో పాటు అల్పాహారం భుజించారు. ఈ క్రమంలో విద్యార్థులు తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడడంతో హుటాహుటిన ఆస్పత్రికి తీసుకెళ్లారు. సకాలంలో చికిత్సలందించడంతో పిల్లలు కోలుకున్నారు. ఫుడ్ పాయిజన్ కావడంతోనే విద్యార్థులు అస్వస్థతకు గురైనట్లు వైద్యులు వెల్లడించారు. వెంటనే చికిత్స చేయడంతో ప్రాణాపాయం తప్పిందని, లేకుంటే పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారేదని తెలిపారు. దీనిపై విద్యార్థులు మాట్లాడుతూ మూడు రోజుల కిందట చేసిన పిండితో ఈరోజు ఇడ్లీలు తయారు చేశారని ఆరోపించారు.
విద్యార్థి సంఘాల ఆందోళన
బీసీ విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించడంలో ప్రభుత్వం విఫలమైందని పలు విద్యార్థి సంఘాల నేతలు మండిపడ్డారు. పిల్లల ఆరోగ్యంతో ఆటలాడడం సరికాదని ఆవేదన వ్యక్తం చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మూడు హాస్టళ్లకు ఒకే వార్డెన్ ఉండడం వల్లే ఈ దుస్థితి దాపురించిందని విమర్శించారు. ఈ క్రమంలోనే ఎంఈఓ బాలయ్య మాట్లాడుతూ ఈ ఘటనపై విచారణ చేపడతామన్నారు. వార్డెన్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కేవలం మూడు రోజుల క్రితమే ఈ హాస్టల్ బాధ్యతలు చేపట్టానని తెలిపారు. రెండు రోజులుగా రేణిగుంట హాస్టల్‌లో అడ్మిషన్లు ఉండడంతో ఇక్కడకి రాలేకపోయానని చెప్పారు. గతంలో వార్డెన్‌గా పనిచేసిన రామయ్య ఇప్పటికీ పూర్తి చార్జ్ అప్పగించలేదన్నారు. అప్పటికీ పిల్లలు అస్వస్థతకు గురి కాగానే వెంటనే ఆస్పత్రికి తరలించామని వివరించారు.
పిల్లలకు పరామర్శ
ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న విద్యార్థులను సీపీఐ ఏరియా కార్యదర్శి జనమాల గురవయ్య, ఏఐఎస్‌ఎఫ్ జిల్లా కార్యదర్శి కోగిల మునిచందు, జిల్లా విద్యార్థి సంఘం నేత కత్తి రవి తదితరులు పరామర్శించారు. వార్డెన్, వంటవాళ్ల నిర్లక్ష్యంతోనే పిల్లలు ప్రాణాపాయంలో పడ్డారని ఆరోపించారు. ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి దీనిపై వెంటనే స్పందించాలని, రెగ్యులర్ వార్డెన్ పోస్టును తక్షణమే భర్తీ చేసేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. అలాగే విద్యార్థులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని కోరారు.
బీసీ హాస్టల్‌లో కలుషిత ఆహారం
16 మంది విద్యార్థులకు అస్వస్థత

అల్పాహారం తిని ప్రాణాపాయం

అల్పాహారం తిని ప్రాణాపాయం