
విద్యుత్ బస్సుల నిర్వహణపై అవగాహన
తిరుపతి అర్బన్ : విద్యుత్ బస్సుల నిర్వహణపై అన్ని డిపోలకు చెందిన మేనేజర్లకు పూర్తి అవగాహన ఉండాలని ఆర్టీసీ కేంద్ర కార్యాలయ ముఖ్య అధికారి గద్దె నాగేశ్వరరావు తెలిపారు. తిరుపతి డీపీటీవో కార్యాలయంలో మంగళవారం జిల్లాలోని డీఎంలకు హైదరాబాద్ నుంచి వచ్చిన వీఎన్‌ఆర్ విజ్ఙానజ్యోతి ఇంజినీరింగ్ టెక్నాలజీ సంస్థకు చెందిన వారు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. జిల్లాలో ప్రస్తుతం వంద విద్యుత్ బస్సులను అలిపిరి డిపో నుంచి నిర్వహిస్తున్నారని చెప్పారు. కొత్తగా 50 విద్యుత్ బస్సులు జిల్లాకు రానున్నాయని...వాటిని మంగళం డిపో నుంచి నిర్వహిస్తారని వెల్లడించారు. కార్యక్రమంలో డీపీటీవో వెంకట్రావ్, డిప్యూటీ సీటీఎం విశ్వనాథ, డిప్యూటీ మెకానిక్ ఇంజినీర్ బాలాజీ, అలిపిరి డీఎం హరిబాబు పాల్గొన్నారు.
26,28,29 తేదీల్లో
చైన్నె మెమో రైలు రద్దు
నాయుడుపేటటౌన్ : చైన్నె నుంచి నెల్లూరు వెళ్లే మెమో రైలు ఈనెల 26, 28, 29 తేదీల్లో రాకపోకలు రద్దు చేసినట్లు రైల్వే స్టేషన్ మేనేజర్ చిరంజీవి మంగళవారం తెలిపారు. పోన్నేరి తదితర ప్రాంతాల్లో రైల్వే లైన్ల మరమ్మతుల కారణంగా మెమో రైలు రద్దు చేసినట్లు రైల్వే ఉన్నతాధికారులు ప్రకటించినట్లు స్టేషన్ మేనేజర్ వెల్లడించారు. ఈ అసౌకర్యాన్ని రైల్వే ప్రయాణికులు తెలుసుకోవాలన్నారు.
నేడు డిప్లొమో కరికులంపై ప్రాంతీయ వర్క్‌షాప్
తిరుపతి ఎడ్యుకేషన్: రాష్ట్ర సాంకేతిక విద్య, శిక్షణా బోర్డు (ఎస్‌బీటీఈటీ) ఆధ్వర్యంలో పాలిటెక్నిక్ డిప్లొమో కరికులంపై తిరుపతిలోని గోల్డెన్ తులీప్ హోటల్‌లో బుధవారం ప్రాంతీయ వర్క్‌షాపు నిర్వహించనున్నట్టు స్థానిక ఎస్వీ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వై.ద్వారకనాధరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ వర్క్‌షాప్‌కు సాంకేతిక విద్య డైరెక్టర్ జి.గణేష్‌కుమార్, ఎస్‌బీటీఈటీ కార్యదర్శి జీవీవీఎస్.మూర్తి, ట్రైనింగ్ అండ్ ప్లేస్‌మెంట్ ఆఫీసర్ డాక్టర్ ఎంఏవీ.రామకృష్ణ, డెప్యూటీ కార్యదర్శి డాక్టర్ కె.లక్ష్మీపతి హాజరవుతారని, ఈ వర్క్‌షాప్‌లో పలువురు పారిశ్రామికవేత్తలు, యూనివర్సిటీ ప్రొఫెసర్లు, పాలిటెక్నిక్ ప్రిన్సిపాళ్లు, టీచర్లు పాల్గొని పాలిటెక్నిక్ డిప్లొమో విద్యార్థులకు అవసరమైన సిలబస్ తయారీపై చర్చించనున్నట్లు ఆయన తెలిపారు.
ఎస్వీయూను సందర్శించిన యూకే డిప్యూటీ హైకమిషనర్
తిరుపతి సిటీ: యునైటెడ్ కింగ్‌డమ్ డిప్యూటీ హైకమిషనర్ విన్ ఓవెన్ మంగళవారం ఎస్వీ యూనివర్సిటీని సందర్శించారు. ఆయన ఎస్వీయూ వీసీ అప్పారావు, రిజిస్ట్రార్ భూపతినాయుడుతో సమావేశమయ్యారు. ఆయన మాట్లాడుతూ, భారతీయ పారిశ్రామిక రంగాలతో యూకే బలమైన భాగస్వామ్యాన్ని ఏర్పాటు చేసేందుకు అంకితభావంతో ఉందన్నారు. ఉమ్మడి పరిశోధన, విద్యామార్పిడి, వాణిజ్య వెంచర్ల కోసం స్పష్టమైన మార్గాలను అన్వేషించడం తన సందర్శన లక్ష్యమని చెప్పారు. ఏపీలో అమలవుతున్న విద్యా విధానం, అభివృద్ధి చెందుతున్న ఐటీ రంగంలో సహాయ సహకారాలకు ఉన్న అవకాశాలపై చర్చించారు. కార్యక్రమంలో వంశీకృష్ణ, లక్ష్మి, శ్రీనివాస్, శశికుమార్, డాక్టర్ వివేక్ తదతరులు పాల్గొన్నారు.
అగ్రికల్చర్ డిప్లొమా ప్రవేశాలకు 30 వరకు గడువు
తిరుపతి సిటీ: ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలో 2025–26 విద్యాసంవత్సరానికి అగ్రికల్చర్ పాలిటెక్నిక్‌లో ప్రవేశాలు పొందేందుకు దరఖాస్తు గడుపు ఈనెల 30 వరకు పొడిగించినట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వి.సుమతి ఒక ప్రకటనలో తెలిపారు. వాస్తవానికి ఈ నెల 16తో ప్రవేశాల గడువు ముగిసిందని, విద్యార్ధుల సౌకర్యార్థం నెలాఖరు వరకు గడువు పెంచినట్లు చెప్పారు. అగ్రికల్చర్, ఆర్గానిక్, సీడ్ టెక్నాలిజీ, అగ్రి ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలు పొందేందుకు విద్యార్ధులు విశ్వవిద్యాలయం వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ డిప్లొమా కోర్సుల్లో చేరడానికి ఎలాంటి ప్రవేశ పరీక్ష ఉండదని, పదోతరగతిలో పొందిన మార్కుల ఆధారంగా సీట్లు కేటాయిస్తారని తెలియజేశారు.

విద్యుత్ బస్సుల నిర్వహణపై అవగాహన