
విషమంగా బాలుడి ఆరోగ్యం
చంద్రగిరి : రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన బాలుడు గిరిసాయి ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఆదివారం చంద్రగిరి సమీపంలోని తూర్పుపల్లె వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తల్లిదండ్రులు మృత్యువాత పడగా పిల్లలు గిరిసాయి, గాయత్రిలు గాయపడ్డారు. గిరిసాయికి తొలుత రుయాలో వైద్య పరీక్షలు నిర్వహించారు. చికిత్సకు ఎలాంటి స్పందన లేకపోవడంతో అధికారులు హుటాహుటిన స్విమ్స్‌కు తరలించారు. ఆదివారం నుంచి అత్యవసర విభాగంలో బాలుడికి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం గిరిసాయికి వెంటిలేటర్‌పై చికిత్సను కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం బాలుడి పరిస్థితి విషమంగా ఉందని, మరో 24 గంటలు గడిస్తే తప్ప ఏమీ చెప్పలేమని వైద్యాధికారులు తెలిపారు. సోమవారం ఈ క్రమంలోనే ప్రమాదంలో మృతి చెందిన గిరిసాయి తల్లిదండ్రులు సిద్ధయ్య, జ్యోతిలక్ష్మి మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తి చేసి బంధువులకు అప్పగించారు. వారు స్వగ్రామానికి తరలించి, అంత్యక్రియలను పూర్తి చేశారు.