
మేధో వలస నివారణకు చర్యలు
తిరుపతి సిటీ: దేశం నుంచి మేధో వలస నివారణకు చర్యలు తీసుకోవాల్సిన అవసరముందని తిరుపతి పద్మావతి మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి డాక్టర్ టీఎం నగేష్ తెలిపారు. స్థానిక జాతీయ సంస్కృత వర్సిటీలో ఆదివారం ఏపీ సమాలోచన మేధావుల వేదిక ఆధ్వర్యంలో రోల్ ఆఫ్ ఇంటలెక్చువల్స్ ఇన్ షేపింగ్ వికసిత్ భారత్ అనే అంశంపై చర్చ చేపట్టారు. ఇందులో డాక్టర్ నగేష్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ మేధాశక్తి వలస వెళ్లడంతో దేశాభివృద్ధికి నష్టం ఏర్పడుతోందన్నారు. యువతతో పాటు పలు రంగాల్లో నిపుణులైన మానవ సంపద ఇతర దేశాల ఆర్థికాభివృద్ధికి సహకరించడం సమంజసం కాదన్నారు. భారతదేశంలో మేధావి వర్గానికి కొదవలేదని, అది ఎగుమతి కాకుండా నివారించాల్సిన బాధ్యత సమాజంతో పాటు ప్రభుత్వాలకు ఉందన్నారు. దేశంలోని వనరులను సక్రమమైన రీతిలో వినియోగంచుకుంటే దేశాభివృద్ధితో పాటు ప్రభుత్వం తలంచిన వికసిత్ భారత్ సాధ్యమవుతుందని అభిప్రాయపడ్డారు. భారతదేశానికి ప్రపంచ దేశాల్లో ప్రత్యేక గుర్తింపు ఉందని, ఇతర దేశాల నుంచి వస్తువులను పెద్ద ఎత్తున దిగుమతి చేసుకుంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో తయారు చేసిన వస్తువుల ఎగుమతికంటే దిగుమతి ఎక్కువగా ఉండడం బాధాకరమన్నారు. కార్యక్రమంలో ఆర్‌ఎస్‌ఎస్ క్షేత్ర ప్రచారక్ భరత్‌కుమార్, డాక్టర్ లక్ష్మీప్రియ, కన్వీనర్ సోమశేఖర్, నరేంద్ర, బాలాజీ, విశ్వనాథ్, రాజశేఖర్ పాల్గొన్నారు.