
బాధితునికి రూ.20 వేలు పరిహారం చెల్లించాలి
వినియోగదారుల సంక్షేమ నిధికి రూ.30 వేలు చెల్లించాలి
బిగ్ బౌల్ స్పెషల్ చాప్సూయ్, జోమోటో కంపెనీలకు కమిషన్ ఆదేశం
సిటీ కోర్టులు: ‘బిగ్ బౌల్ స్పెషల్ చాప్సూయ్‘ రెస్టారెంట్ నుంచి శాఖాహారాన్ని ఆర్డర్ చేస్తే మాంసాహారాన్ని పంపడం ముమ్మాటికీ రెస్టారెంట్ తప్పేనని రంగారెడ్డి జిల్లా వినియోగదారుల కమిషన్ అభిప్రాయపడింది. అందుకు బాధితుడికి రూ. 20 వేల నష్టాపరిహారాన్ని అందజేయాలని ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. ఈ మొత్తాన్ని 45 రోజుల్లోపు చెల్లించాలని పేర్కొంది.
వివరాల్లోకి వెళితే.. కొండాపూర్‌కు చెందిన వెంకటశరత్ అనే వ్యక్తి జొమోటో ద్వారా ‘బిగ్ బౌల్ స్పెషల్ చాప్సూయ్‘ రెస్టారెంట్ నుంచి శాఖాహారాన్ని ఆర్డర్ చేశాడు. అయితే జొమోటో నుంచి అసంపూర్తిగా ఉన్న శాఖాహారం వచ్చింది. వెంటనే సంబంధిత రెస్టారెంట్‌కు ఫిర్యాదు చేయగా వారు క్షమాపణలు చెప్పి తిరిగి ఆర్డర్ డెలివరీ చేశారు. అప్పుడు వచి్చన ఆర్డర్ తీసుకొని తింటూ ఉండగా అది శాఖాహారం కాదని, మాంసాహారమని గుర్తించిన అతను రెస్టారెంట్ నిర్వాహకులకు ఫిర్యాదు చేసేందుకు ఎంత ప్రయత్నించినా వారు ఫిర్యాదును తీసుకోకపోవడమే కాకుండా కనీసం ఎలాంటి చర్యలు కూడా చేపట్టలేదు.
దీంతో బాధితుడు రంగారెడ్డి జిల్లా వినియోగదారుల ఫోరంలో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్‌పై విచారణ చేపట్టిన కమిషన్ మొదట్లో అసంపూర్తిగా ఉన్న శాఖాహారాన్ని పంపిన రెస్టారెంట్ తర్వాత శాఖాహారం కాకుండా మాంసహారం ఎలా పంపుతారని ప్రశ్నించిన. ఇంతటి నిర్లక్ష్యానికి పాల్పడిన రెస్టారెంట్, జొమోటో కంపెనీలు ఒక్కొక్కరూ రూ.5 వేలు చొప్పున నష్టపరిహారాన్ని అదేవిధంగా కోర్టు ఖర్చుల నిమిత్తం చెరో రూ.5 వేలు ఫిర్యాదు దారుడికి 45 రోజుల్లోపు చెల్లించాలని ఉత్తర్వులు జారీ చేసింది.
ఆ లోపు చెల్లించకుంటే కోర్టు ఆర్డర్‌కు రెట్టింపు అంటే ఒక్కొక్కరూ రూ.10 వేలు చెల్లించాల్సి ఉంటుందని తేల్చిచెప్పింది. భవిష్యత్తులో ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. అంతేకాకుండా వినియోగదారుల రక్షణ చట్టం 2019లోని సెక్షన్ 39(1)(డీ) ప్రకారంగా ఒక్కొక్కరు రూ.15 వేల చొప్పున మొత్తం రూ.30 వేలను వినియోగదారుల సంక్షేమ నిధికి చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది.