
ఆశాజనకంగా ప్రపంచస్థాయి పరిశోధన ఫలితాలు
సాక్షి, హైదరాబాద్: కాలేయ వ్యాధిగ్రస్తులకు ఇప్పటివరకు సరైన మందు లేదు. కాలేయం చెడిపోతే ట్రాన్స్‌ప్లాంటేషన్ తప్ప సరైన చికిత్స అందుబాటులోకి రాలేదు. దీంతో సరైన మందు లేక తీవ్రంగా బాధపడుతున్న రోగులకు ఊరట కలిగించే శుభవార్తను శాస్త్రవేత్తలు వెల్లడించారు. మధుమేహానికి వినియోగించే ‘సెమాగ్లుటైడ్’అనే మందు, ఇప్పుడు లివర్ వ్యాధుల చికిత్సలో కూడా ఉపయోగపడుతుందని లండన్ కింగ్స్ కాలేజ్ శాస్త్రవేత్తలు వెల్లడించారు.
ఈ మందుతో కాలేయంలోని గాయాలు తగ్గినట్లు గుర్తించారు. ముఖ్యంగా ‘మెటబాలిక్ డిస్‌ఫంక్షన్ అసోసియేటెడ్ స్టియాటో హెపటైటిస్’(సాధారణంగా మాష్ అని పిలుస్తారు) అనే కాలేయ వ్యాధిని నియంత్రించడమే కాకుండా కొంతవరకు తిరిగి సరిచేసే శక్తి కూడా ఈ మందుకు ఉందని తాజా అధ్యయనం వెల్లడైంది.
ప్రపంచవ్యాప్తంగా 37 దేశాల్లో పరిశోధన..
ప్రపంచంలోని 37 దేశాల్లో 800 మందిపై ఈ ఔషధ ప్రయోగం నిర్వహించారు. వారిని రెండు వర్గాలుగా విభజించారు. ఒక వర్గానికి ప్రతి వారం సెమాగ్లుటైడ్ మందును అందించగా, మరొక గ్రూపునకు ప్లాసెబో (నకిలీ మందు) ఇచ్చారు. 72 వారాల పాటు జరిపిన ఈ ప్రయోగం ఫలితాలు ఆశాజనకంగా ఉన్నాయి.
» సెమాగ్లుటైడ్ తీసుకున్న వారిలో 63 శాతం మందికి లివర్ మంట తగ్గినట్టు తేలింది. దాదాపు 37 శాతం మందిలో కాలేయంలోని గాయాలు (ఫైబ్రోసిస్) తగ్గినట్టు గుర్తించారు.
» ఇదే సమస్య ప్లాసెబో (నకిలీ మందు) వాడిన వారిలో కేవలం 22 శాతం మందిలో మాత్రమే కనిపించింది. ఈ మందు వాడిన వారు సాధార ణంగా బరువు తగ్గినట్టు కూడా తెలిసింది.
» సెమాగ్లుటైడ్ మందు వాడిన వారిలో కొందరికి వాంతులు, జీర్ణ సమస్యలు తలెత్తినప్పటికీ, ఆశాజనక ఫలితాల ముందు ఇవి తక్కువే అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
» ఈ మందును వాడిన కొంతమందికి వాంతులు, మలబద్ధకం, విరోచనాలు వంటి జీర్ణసంబంధిత స మస్యలు ఎదురయ్యాయి. అయితే ఇవి తాత్కాలిక మేనని, దీర్ఘకాల ప్రయోజనాలతో పోల్చితే తక్కు వేనని వైద్య నిపుణులు చెబుతున్నారు.
లివర్ సమస్యలకి కారణాలు అనేకం: అధిక కొవ్వు, మధుమేహం, అధిక రక్తపోటు, శరీరం చురుకుదనం లేకపోవడం వంటి కారణాలతో లివర్‌లో కొవ్వు పేరుకుని కాలేయం పాడవుతుంది. దీన్ని నాన్–ఆల్కహాలిక్ కొవ్వు కాలేయ వ్యాధి అని పిలుస్తారు. ఇది తీవ్రమై ‘మాష్’గా మారితే, కాలేయం పూర్తిగా పనిచేయకుండా పోయే ప్రమాదం ఉంది.
» ‘ఇలాంటి మందు తయారవడం ద్వారా తీవ్రమైన కాలేయ వ్యాధులకు కొత్త మార్గం ఏర్పడింది. ము ఖ్యంగా మధుమేహంతో బాధపడే వారికి ఇది ప్ర యోజనకరం’అని పరిశోధనకు నాయకత్వం వహించిన ప్రొఫెసర్ ఫిలిప్ న్యూసమ్ తెలిపారు.