కోటాపై ముందుకే! | Telangana Govt to approach Supreme Court on High Court stay | Sakshi
Sakshi News home page

కోటాపై ముందుకే!

Oct 12 2025 1:09 AM | Updated on Oct 12 2025 1:09 AM

Telangana Govt to approach Supreme Court on High Court stay

స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లపై సర్కారు నిర్ణయం 

హైకోర్టు స్టేపై సుప్రీంకోర్టును ఆశ్రయించనున్న రాష్ట్ర ప్రభుత్వం

ఉన్నత న్యాయస్థానం తీర్పు క్షుణ్ణంగా పరిశీలన 

సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు, న్యాయ నిపుణుల విస్తృత చర్చలు 

రేపు స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ దాఖలు చేయాలని నిర్ణయం 

రిజర్వేషన్లపై కసరత్తు, బిల్లుల పెండింగ్‌ సహా అన్ని విషయాలు వివరించాలన్న సీఎం 

త్వరలో జరిగే కేబినెట్‌ భేటీ ఎజెండాలో బీసీ రిజర్వేషన్లు 

సుప్రీంలో ఎలాంటి తీర్పు వస్తే ఎలా ముందుకెళ్లాలనే దానిపై చర్చించే చాన్స్‌

సాక్షి, హైదరాబాద్‌: బీసీ రిజర్వేషన్లు, స్థానిక ఎన్నికలకు సంబంధించిన జీవోలు 9, 41, 42లను నిలిపివేస్తూ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సుప్రీంకోర్టులో సవాల్‌ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం జాతీయ, రాష్ట్ర స్థాయిల్లో రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకున్న ఈ అంశంపై సోమవారం సర్వోన్నత న్యాయస్థానంలో పిటి షన్‌ వేయనుంది. హైకోర్టు తీర్పు దరిమిలా తదుపరి కార్యాచరణపై ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి, మంత్రులు, న్యాయ నిపుణులు, రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు అన్ని కోణాల్లో చర్చించాక సుప్రీంకోర్టులో స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ (ఎస్‌ఎల్‌పీ) దాఖలుకే ప్రభుత్వం మొగ్గుచూపుతున్నట్లు అధికారవర్గాల సమాచారం. ఎట్టి పరిస్థితుల్లోనూ దేశంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికే దక్కేలా చేయాలన్న దృఢ సంకల్పంతో ప్రభుత్వం ఉన్నట్లు ఆ వర్గాలు చెబుతున్నాయి.  

అన్నీ క్షుణ్ణంగా పరిశీలించాకే.. 
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ బీసీ సంక్షేమశాఖ ఇచ్చిన జీవో నంబర్‌ 9తో పాటు దాని ఆధారంగా గ్రామ పంచాయతీ, మండల, జిల్లా పరిషత్‌లలో రిజర్వేషన్ల ఖరారుపై పంచాయతీరాజ్‌ శాఖ జారీ చేసిన జీవోలు 41, 42ల అమలుపై హైకోర్టు స్టే ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఈ నెల 9 నుంచి అయిదు విడతల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్‌ స్థానాల్లో ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ (ఎస్‌ఈసీ) జారీ చేసిన నోటిఫికేషన్‌ కూడా రద్దయిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలోనే హైకోర్టు విధించిన స్టే ఎత్తివేయాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కోర్టు మధ్యంతర ఉత్తర్వులకు సంబంధించిన అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించాకే సుప్రీంను ఆశ్రయించాలనే నిర్ణయానికి వచ్చినట్టు విశ్వసనీయ సమాచారం. 

16న కేబినెట్‌లో చర్చ.. 
ఈ నెల 16వ తేదీన కేబినెట్‌ భేటీ నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిర్ణయించారు. స్థానిక ఎన్నికలు, బీసీ రిజర్వేషన్ల అంశంతో పాటు, సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించిన ప్రాధాన్యత అంశాలు, ఏపీ చేపడుతున్న ‘బనకచర్ల’, ఆలమట్టి ఎత్తు పెంపు తదితర అంశాలపై చర్చించే అవకాశం ఉంది. రిజర్వేషన్ల విషయంలో సుప్రీంకోర్టుకు వెళ్లిన తర్వాత ఎలాంటి తీర్పు వెలువడితే ఏ విధంగా ముందుకు వెళ్లాలనే దానిపై కూడా మంత్రివర్గ సమావేశంలో చర్చించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. 

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌గౌడ్, ప్రభుత్వ జీవోలు, స్థానిక ఎన్నికల నిర్వహణతో ముడిపడిన వివిధ శాఖల మంత్రులు కూడా ఆయా అంశాలపై తమ అభిప్రాయాలను ఇప్పటికే వెల్లడించారు. మొత్తం 50 శాతం రిజర్వేషన్లతో ఈ ఎన్నికలు నిర్వహించుకోవచ్చునని హైకోర్టు స్పష్టం చేసింది. ప్రత్యేక జీవో ద్వారా బీసీలకు అదనంగా కేటాయించిన 17 శాతం రిజర్వేషన్లను ఆన్‌ రిజర్వ్‌డ్‌ (జనరల్‌)గా పరిగణించి, పెంచిన రిజర్వేషన్లు సర్దుబాటు చేయాలని సూచించింది. 

ఈ నేపథ్యంలో..బీసీ రిజర్వేషన్ల పెంపుదలకు సంబంధించి చేసిన కసరత్తు, ఆ దిశలో కొన్ని నెలలుగా సాగించిన కృషిని తుదకంటా కొనసాగించాలనే నిశ్చితాభిప్రాయానికి రాష్ట్ర ప్రభుత్వం వచ్చినట్టు సమాచారం. తద్వారా స్థానిక సంస్థలలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల సాధన విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరిస్తోందనే సంకేతాలు ప్రజల్లోకి వెళ్లాలన్నది ప్రభుత్వ ఆలోచన అని అంటున్నారు.  

సుప్రీంలో సమర్థ వాదనలు వినిపించాలి 
బీసీ రిజర్వేషన్లకు సంబంధించి సుప్రీంకోర్టులో బలమైన వాదనలు వినిపించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రిజర్వేషన్ల కోసం బీసీ కమిషన్‌ ఆధ్వర్యంలో ఇంటింటి సర్వే, ఏకసభ్య కమిషన్‌ ఏర్పాటు, ఎంపిరికల్‌ డేటా విశ్లేషణ అనంతర  నివేదికల ఆధారంగా శాసనసభలో బిల్లులు ఆమోదం, వాటిని గవర్నర్‌ ఆమోదం కోసం పంపించిన తీరును సుప్రీంకోర్టుకు సవివరంగా తెలియజేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను, న్యాయ నిపుణులను కోరినట్లు సమాచారం. 

ఎట్టి పరిస్థితుల్లోనూ స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు చట్టబద్ధంగా కల్పించిన తర్వాతే ఎన్నికలకు వెళ్లాలన్న నిర్ణయానికి కట్టుబడి ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. 2018 పంచాయతీరాజ్‌ చట్టానికి సవరణలు, స్థానిక సంస్థల్లో 50 శాతం పరిమితికి మించి రిజర్వేషన్ల అమలుకు మొదట ఆర్డినెన్స్‌ ఆ తర్వాత బిల్లుల ఆమోదం వంటి కీలక అంశాలలో జరుగుతున్న జాప్యాన్ని కూడా సుప్రీంకోర్టు దృష్టికి తీసుకురావాలని, రిజర్వేషన్లకు సంబంధించిన ట్రిపుల్‌ టెస్ట్‌ను పకడ్బందీగా నిర్వహించిన విషయం వివరించాలని నిర్ణయించారు. 

అసెంబ్లీలో బిల్లులకు అన్ని రాజకీయ పార్టీలు కూడా ఏకగ్రీవంగా ఆమోదం తెలిపాయన్న విషయాన్ని ప్రధానంగా ప్రస్తావించాలని భావిస్తున్నారు. రాష్ట్రపతి, గవర్నర్‌ల వద్ద 90 రోజుల పరిమితికి మించి బిల్లులు పెండింగ్‌లో ఉంటే అవి ఆమోదం పొందినట్టుగానే భావించాల్సి ఉంటుందని గతంలో సుప్రీంకోర్టు.. తమిళనాడు ప్రభుత్వం విషయంలో ఇచ్చిన ఉత్తర్వులను గురించి ప్రస్తావించనున్నట్టు తెలుస్తోంది. లక్షల మందికి పైగా ఉద్యోగులతో చేసిన సర్వే వివరాలను సుప్రీంకోర్టు ముందుంచాలని నిర్ణయించినట్లు సమాచారం.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement