
శిల్పకళా వేదిక ఆడిటోరియంలో కార్యక్రమం
49 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులు
ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: ఉత్తమ ఉపాధ్యాయుడు, భారత మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం గురుపూజ దినోత్సవాన్ని నిర్వహించనుంది. హైదరాబాద్ శిల్పకళా వేదిక ఆడిటోరియంలో జరిగే ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరవుతారని విద్యాశాఖ వెల్లడించింది. ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి , మంత్రి శ్రీధర్‌బాబు, కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్ కార్యక్రమంలో పాల్గొంటారని విద్యాశాఖ తెలిపింది. ఈ సందర్భంగా 49 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులు ఇవ్వనున్నారు.
ఆహా్వనంపై సర్వేపల్లి పేరేది?
ఇదిలా ఉండగా ఉపాధ్యాయుడి స్థాయి నుంచి రాష్ట్రపతి వరకూ ఎదిగిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ పేరును విద్యాశాఖ రూపొందించిన ఆహా్వన పత్రికపై ముద్రించలేదని సమాచారం. ముఖ్యమంత్రి, ఇతర మంత్రుల పేర్లను ముద్రించేందుకు ఆరాట పడ్డ విద్యాశాఖ.. సర్వేపల్లి ఫొటోను మాత్రమే ప్రచురించి వదిలేసిందని విమర్శలు వస్తున్నాయి. దీనిపై విద్యాశాఖ జాయింట్ డైరెక్టర్ మదన్‌ను వివరణ కోరగా.. గత ఏడాది ఆహ్వాన పత్రికలో కూడా లేదని, అందుకే ముద్రించలేదని తెలిపారు.