క్రిమినల్‌ కేసులకూ ఎన్‌ స్టెప్‌ | Supreme Court Judge Justice BR Gavai Launches NSTP for Criminal Justice System: Telangana | Sakshi
Sakshi News home page

క్రిమినల్‌ కేసులకూ ఎన్‌ స్టెప్‌

Nov 24 2024 6:14 AM | Updated on Nov 24 2024 6:14 AM

Supreme Court Judge Justice BR Gavai Launches NSTP for Criminal Justice System: Telangana

ప్రారంభించిన సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌ 

కేసుల విచారణ ఇక వేగవంతమవుతుందని వెల్లడి 

మొబైల్‌ యాప్‌ ద్వారా నోటీసులు, సమన్ల జారీకి మార్గం

సాక్షి, హైదరాబాద్‌: సత్వర న్యాయం పొందటం ప్రజల ప్రాథమిక హక్కు అని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ భూషణ్‌ రామకృష్ణ గవాయ్‌ అన్నారు. ముఖ్యంగా క్రిమినల్‌ కేసుల్లో విచారణ ప్రక్రియ వేగవంతంగా జరగాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. కేసుల విచారణలో విపరీతంగా జాప్యం జరుగుతోందని.. ‘న్యాయం ఆలస్యమైతే న్యాయాన్ని నిరాకరించినట్టే’అన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలని సూచించారు. శనివారం జ్యుడీషియల్‌ అకాడమీలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రంలోని జిల్లా న్యాయవ్యవస్థలో క్రిమినల్‌ కేసులకు నేషనల్‌ సర్విస్‌ అండ్‌ ట్రాకింగ్‌ ఆఫ్‌ ఎల్రక్టానిక్‌ ప్రాసెస్‌ (ఎన్‌ స్టెప్‌) ప్రక్రియను జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌ ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసుల పరిష్కారాన్ని వేగవంతం చేసేందుకు ఎన్‌ స్టెప్‌ వెబ్‌ అప్లికేషన్‌ దోహదం చేస్తుందని తెలిపారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అలోక్‌ అరాధే మాట్లాడుతూ.. ఎన్‌ స్టెప్‌ అప్లికేషన్‌ను క్రిమినల్‌ కేసులకూ వర్తింపజేయడం అభినందనీయమని అన్నారు. క్రిమినల్‌ కేసులకు ఎన్‌ స్టెప్‌ అప్లికేషన్‌ను వినియోగించటంలో తెలంగాణ రాష్ట్రం మూడో స్థానంలో ఉందని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సుజోయ్‌ పాల్‌ తెలిపారు. కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ పి.శామ్‌ కోషితోపాటు ఇతర న్యాయమూర్తులు, డీజీపీ జితేందర్, బార్‌ కౌన్సిల్‌ చైర్మన్‌ ఎ.నరసింహారెడ్డి, హైకోర్టు బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు ఎ.రవీందర్‌రెడ్డి, అడ్వొకేట్‌ జనరల్‌ ఎ.సుదర్శన్‌రెడ్డి, అడిషనల్‌ ఏజీ తేరా రజనీకాంత్‌రెడ్డి, రిజి్రస్టార్లు, జిల్లా జడ్జీలు పాల్గొన్నారు.  

ఏమిటీ ఎన్‌ స్టెప్‌? 
నేషనల్‌ సర్విస్‌ అండ్‌ ట్రాకింగ్‌ ఆఫ్‌ ఎల్రక్టానిక్‌ ప్రాసెస్‌. దీనిని సంక్షిప్తంగా ఎన్‌ స్టెప్‌ అని పిలుస్తున్నారు. ఇది మొబైల్‌ యాప్‌తో కూడిన కేంద్రీకృత ప్రాసెస్‌ సర్విస్‌ ట్రాకింగ్‌ అప్లికేషన్‌. బెయిలిఫ్‌లకు, ప్రాసెస్‌ సర్వర్లకు దీని ద్వారా నోటీసులు, సమన్లను వేగంగా అందజేయవచ్చు. ఎన్‌ స్టెప్‌ ద్వారా ఎల్రక్టానిక్‌ రూపంలో నోటీసులు, సమన్లు జారీ చేస్తారు. మారుమూల ప్రాంతాలకు కూడా ఇవి వేగంగా చేరిపోతాయి. దీంతో కేసుల విచారణలో అనవసర జాప్యాన్ని నివారించవచ్చు. దీనిని ఇప్పటివరకు సివిల్‌ కేసుల్లోనే వినియోగిస్తూ వచ్చారు. తొలిసారి క్రిమినల్‌ కేసులకూ వర్తింపజేయనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement