ఆన్‌లైన్‌ పాఠాలతో ఒత్తిడి

Students Stress Feel With Online Classes Hyderabad - Sakshi

చిన్నారుల మానసిక వికాసంపై ప్రభావం 

తరగతి గదికి ప్రత్యామ్నాయం కాదంటున్న నిపుణులు  

ఇష్టాగోష్టిలా విద్యాబోధన ఉండాలి సృజనాత్మకతకు పదును పెట్టాలి  

సాక్షి, సిటీబ్యూరో: ప్రణీత్‌ పదో తరగతి స్టూడెంట్‌. చాలా చురుకైన విద్యార్థి. అతడు ఎక్కడ ఉంటే అక్కడ సందడిగా ఉంటుంది. కానీ కొద్ది రోజులుగా అతడు మౌనంగా ఉంటున్నాడు. ఇంట్లో ఎవరితోనూ మాట్లాడటం లేదు. సాధారణంగా ఉదయం ఆరింటికి నిద్రలేచి చక్కగా రెడీ అయి స్కూల్‌కు వెళ్లేవాడు. ఇప్పుడు ఉదయం 8 గంటలు దాటినా లేవలేకపోతున్నాడు. నిద్ర కళ్లతోనే కంప్యూటర్‌ ముందు కూర్చుని ఆన్‌లైన్‌ తరగతులకు హాజరవుతాడు. అతడి ప్రవర్తనలో వచ్చిన మార్పుతో తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. మానసిక నిపుణులను సంప్రదించారు. సహజమైన స్కూల్‌ వాతావరణానికి భిన్నంగా ఆన్‌లైన్‌ పాఠాలకు  హాజరుకావడంతో తీవ్రమైన ఒత్తిడికి గురైనట్లు మానసిక వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇలా.. ఒక్క ప్రణీత్‌ మాత్రమే కాదు. చాలా మంది పిల్లలు ఇలాంటి మానసిక స్థితినే ఎదుర్కొంటున్నారు.  

నగరంలోని  అనేక  ప్రాంతాల్లో ప్రైవేట్‌ స్కూళ్లు  ప్రస్తుతం ఆన్‌లైన్‌ క్లాస్‌లను నిర్వహిస్తున్నాయి. కొన్ని స్కూళ్లలో ఒకటో తరగతి నుంచే ఈ బోధన కొనసాగుతుండగా మరికొన్ని స్కూళ్లు 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఆన్‌లైన్‌ తరగతులను నిర్వహిస్తున్నాయి. కరోనా మహమ్మారి కారణంగా నెలకొన్న పరిస్థితులతో పిల్లల చదువులే కాకుండా విద్యాసంస్థల మనుగడ కూడా ఇప్పుడు ఆన్‌లైన్‌పై ఆధారపడి ఉండడం గమనార్హం. ఈ నేపథ్యంలో నిర్వహిస్తున్న కంప్యూటర్‌ పాఠాలు పిల్లలపై ఒత్తిడిని తీవ్రతరం చేస్తున్నాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బోధనా పద్ధతిలో మార్పు అవసరమని సూచిస్తున్నారు. క్లాస్‌ రూమ్‌ తరహాకు భిన్నంగా ఇష్టాగోష్టి పద్ధతిలో ఆన్‌లైన్‌ విద్యాబోధన ఉండాలని  అభిప్రాయడుతున్నారు. 

వికాసంపై వేటు.. 
ఆన్‌లైన్‌ క్లాసులతో పిల్లలు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు  కంప్యూటర్‌కు అతుక్కుపోతున్నారు. కొంతమంది మొబైల్‌ ఫోన్‌లలో క్లాసులకు హాజరవుతున్నారు. దీంతో కేవలం ఒక డివైజ్‌పై దృష్టి సారించి గంటల తరబడి కూర్చోవడం వల్ల పిల్లల సృజనాత్మకత దెబ్బతింటుంది. 
చాలా మంది పిల్లలు కళ్లు పొడిబారడం, తలనొప్పి, వెన్నెముక నొప్పి వంటి శారీరక ఇబ్బందులకు గురవుతున్నట్లు డాక్టర్లు చెబుతున్నారు. 
మెదడు తీవ్రమైన ఒత్తిడికి గురవుతుంది. 
కొత్త విషయాలను నేర్చుకొనే సామర్థ్యం దెబ్బతింటుంది. 
చాలా మంది పిల్లలు కంప్యూటర్‌ ముందు కూర్చున్నప్పటికీ  టీచర్లు చెప్పే పాఠాలను అర్థం చేసుకోలేకపోతున్నారు. ఏకాగ్రత లోపిస్తుందని మానసిక వైద్యులు అభిప్రాయపడుతున్నారు.  

 పిల్లల భాగస్వామ్యం తప్పనిసరి.. 
విశాలమైన తరగతి గదిలో తోటి విద్యార్థులతో కలిసి చదువుకొనే వాతావరణానికి భిన్నంగా  నట్టింట్లో కంఫ్యూటర్, మొబైల్‌ ఫోన్, ట్యాప్‌ లాంటివి ముందేసుకొని టీచర్లు చెప్పే పాఠాలను వినడం, నేర్చుకోవడం పిల్లలకు ‘శిక్ష’గానే ఉంటుంది. కానీ కోవిడ్‌ కారణంగా అనివార్యంగా మారిన ఈ విద్యాబోధనను ‘చక్కటి శిక్షణ’గా మార్చేందుకు పిల్లల భాగస్వామ్యాన్ని పెంచడం తప్పనిసరి. ఇందుకోసం ‘టీచర్‌ పాఠం చెబుతుంటే పిల్లలు వినడం’ అనే పద్ధతికి భిన్నంగా ఏదైనా ఒక అంశంపై వీడియో పాఠాలను చూపించి ఆ తర్వాత దానిపై పిల్లలతో చర్చ నిర్వహిస్తే ఎక్కువగా నేర్చుకొంటారని, పిల్లల భాగస్వామ్యం పెరుగుతుందని పేర్కొంటున్నారు.  

మార్కులే ప్రామాణికం కాదు  
మార్కుల కోసమే చదివించడం అనే దృక్పథం నుంచి తల్లిదండ్రులు, విద్యాసంస్థలు మారాలి. పిల్లల్లో సృజనాత్మకతను, జిజ్ఞాసను పెంచేవిధంగా కొత్త విషయాలను తెలుసుకోవడంలో ఆసక్తి కలిగించే విధంగా విద్యాబోధన ఉంటే ఆన్‌లైన్‌ అయినా ఎలాంటి ఇబ్బంది ఉండదు. తోటి విద్యార్థులు, టీచర్లతో కలిసి చదువుకోవడం అనే ఒక సమష్టి కార్యక్రమంగా విద్యాబోధన ఉండాలి. గంటల తరబడి కంప్యూటర్‌ ముందు కూర్చోబెట్టడం సరైన విద్యావిధానం కాదు. – డాక్టర్‌ వీరేందర్, మానసిక వైద్య నిపుణులు 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top