ఆ విద్యుత్‌ ఏమైపోతోంది?

The Power Distribution Company Thousands Of Crores Of Losses Annually - Sakshi

2019–20లో 6,119 ఎంయూల విద్యుత్‌ మాయం! 

సాంకేతిక, వాణిజ్య నష్టాల కింద చూపిన డిస్కంలు 

వీటితో రూ.3,837.65 కోట్ల నష్టం 

వాస్తవ నష్టం మరింత భారీగా ఉంటుందనే అంచనాలు 

స్మార్ట్‌ మీటర్లు, ఫీడర్లు, ట్రాన్స్‌ఫార్మర్ల స్థాయిలో మీటర్లతో నష్టాలకు చెక్‌ 

కేంద్రం ప్రతిపాదించిన సంస్కరణలపై ఆశలు 

సంస్కరణలు అమలు చేస్తేనే.. 
విద్యుత్‌ పంపిణీ రంగంలో సంస్కరణలతో దేశవ్యాప్తంగా డిస్కంలను నష్టాల నుంచి గట్టెక్కించడానికి కేంద్ర ప్రభుత్వం ఇటీవల రూ.3.03 లక్షల కోట్లతో కొత్త పథకాన్ని (ఆత్మనిర్భర్‌–2 కింద) ప్యాకేజీని ప్రకటించింది. వ్యవసాయం మినహా మిగతా కేటగిరీల వినియోగదారులందరికీ స్మార్ట్‌ మీటర్లు బిగించడం, వ్యవసాయ ఫీడర్లను విభజించడం, ఫీడర్లు–డిస్ట్రిబ్యూషన్‌ ట్రాన్స్‌ఫార్మర్లకు మీటర్లు బిగించడం, ప్రతి పట్టణంలో స్కాడా సెంటర్‌ ఏర్పాటు చేయడం, కృత్రిమ మేథ (ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌/ఏఐ) వినియోగం వంటి సంస్కరణలను ప్రతిపాదించింది. వీటిని అమలు చేస్తే డిస్కంలు ‘ఏటీ–సీ’నష్టాలను సమూలంగా నిర్మూలించవచ్చని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.  

సాక్షి, హైదరాబాద్‌: ఏటేటా పెరుగుతున్న నష్టాలతో ప్రభుత్వ రంగ విద్యుత్‌ పంపిణీ సంస్థ (డిస్కం)ల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతోంది. పరిపాలన, నిర్వహణ లోపాలతో కొట్టుమిట్టాడుతున్న డిస్కంలు గట్టెక్కేదెలాగనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఎక్కడెక్కడ నష్టం జరుగుతుందో గుర్తించడం, సాంకేతిక–వాణిజ్యపర లోపాలతో ఏర్పడే ‘ఏటీ–సీ’నష్టాలను నియంత్రించడం, వినియోగదారులకు ఇచ్చే రాయతీలకు తగ్గట్టు ప్రభుత్వ సబ్సిడీలను పెంచడం, అధిక ధర విద్యుత్‌ కొనుగోళ్లను వదులుకోవడం, దుబారా ఖర్చులను తగ్గించుకోవడం వంటి చర్యలు చేపడితేనే.. డిస్కంలు మెరుగుపడతాయని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన సంస్కరణలు తోడ్పతాయని చెప్తున్నారు. 

ఏటా వేల కోట్ల నష్టాలు.. 
డిస్కంలు ఏటా భారీ విద్యుత్‌ నష్టంతో వేల కోట్ల రూపాయల నష్టాలను మూటగట్టుకుంటున్నాయి. దక్షిణ/ఉత్తర తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ(ఎస్పీడీసీఎల్‌/ఎన్పీడీసీఎల్‌)లు 2019–20 ఉమ్మడిగా రూ.6,061 కోట్ల వార్షిక నష్టాలను ప్రకటించగా.. అందులో నియంత్రించదగిన ‘సాంకేతిక, వాణిజ్య(అగ్రిగేట్‌ టెక్నికల్‌ అండ్‌ కమర్షియల్‌/ఏటీ–సీ)’నష్టాలే రూ.3,837.65 కోట్ల మేర ఉండటం గమనార్హం. ఆ ఏడాది రెండు డిస్కంలు కలిపి విద్యుత్‌ ప్లాంట్ల నుంచి 65,751.1 మిలియన్‌ యూనిట్ల (ఎంయూ)ల విద్యుత్‌ను కొనుగోలు చేయగా.. వినియోగదారులకు సరఫరా చేసినట్టు లెక్క తేలినది 59,631.68 ఎంయూలు మాత్రమే. మిగతా 6,119.42 ఎంయూల విద్యుత్‌ ఏమైందో తెలియదు. డిస్కంలు దానిని సాంకేతిక, వాణిజ్య నష్టాల కింద లెక్కలు చూపాయి. 

ఎస్పీడీసీఎల్‌ రూ.24,907.26 కోట్ల వ్యయంతో 45,247.02 ఎంయూ విద్యుత్‌ కొనుగోలు చేయగా.. సరఫరా లెక్కలు 40,981.27 ఎంయూలకే ఉన్నాయి. మిగతా 4,265.75 ఎంయూల విద్యుత్‌ ఏమైంది, ఎలా నష్టపోయిందన్న లెక్కలు తెలియవు. సగటున ఒక్కో యూనిట్‌ విద్యుత్‌ కొనుగోలుకు రూ.5.5 ఖర్చు చేయగా.. వినియోగదారులకు అమ్మినది రూ.6 చొప్పున. అయినా రూ.2,560.68 కోట్లు నష్టపోయింది. 
ఎన్పీడీసీఎల్‌ రూ.11,326.08 కోట్లతో 20,504.08 ఎంయూ విద్యుత్‌ కొన్నది. 18,650.41 ఎంయూల సరఫరా లెక్కలతో రూ.12,848.57 కోట్లు ఆదాయం వచ్చింది. ఒక్కో యూనిట్‌ కొనుగోలుకు సగటున రూ.5.52 పైసలు ఖర్చుచేయగా.. వినియోగదారులకు విక్రయించినది రూ.6.88. అంటే గణనీయంగా ఆదాయం రావాలి. కానీ 1,853.67 ఎంయూల విద్యుత్‌ లెక్కలు తెలియక.. రూ.1,276.97 కోట్ల ఆదాయానికి గండిపడింది. 

వాస్తవ నష్టాలు ఇంకా ఎక్కువే! 
వ్యవసాయం మినహా మిగతా అన్ని కేటగిరీల వినియోగదారులకు విద్యుత్‌ మీటర్లు ఉన్నాయి. దీంతో వ్యవసాయ వినియోగం అంచనాలను పెంచడం ద్వారా నష్టాలను తగ్గించి చూపిస్తున్నారన్న ఆరోపణలు చాలా ఏళ్లుగా ఉన్నాయి. వాస్తవానికి డిస్కంల నష్టాలు ఇంకా ఎక్కువగా ఉంటాయని నిపుణులు చెప్తున్నారు. ఉదాహరణకు 2019–20లో ఎన్పీడీసీఎల్‌ 11,510.14 ఎంయూ విద్యుత్‌ను మీటర్లు గల వినియోగదారులకు విక్రయించగా, మరో 7,140.27 ఎంయూ విద్యుత్‌ను వ్యవసాయానికి సరఫరా చేసినట్టు అంచనా వేసింది. మరో 1,853.66 ఎంయూ నష్టపోయినట్టు చూపింది. అంటే మూడో వంతుకుపైగా విద్యుత్‌ను వ్యవసాయానికే వినియోగించినట్టు పేర్కొంది.  

ఎక్కడికక్కడ నష్టాలు తెలుసుకోవచ్చు 
దేశవ్యాప్తంగా తొలివిడత కింద 2023 డిసెంబర్‌ నాటికి 10 కోట్ల ప్రీపెయిడ్‌ స్మార్ట్‌ మీటర్లను ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్దేశించింది. ఫీడర్లు, డిస్ట్రిబ్యుషన్‌ ట్రాన్స్‌ఫార్మర్ల స్థాయిల్లో ‘కమ్యూనికేబుల్‌ ఏఎంఐ మీటర్ల’ను ఏర్పాటు చేయాలని ఆదేశించింది. వీటిద్వారా ఏయే ప్రాంతాల్లో, ఏ కారణాలతో విద్యుత్‌ నష్టాలు వస్తున్నాయో గుర్తించవచ్చు. సాంకేతిక లోపాలతో నష్టం వచ్చినా, చౌర్యం జరుగుతున్నా తెలిసిపోతుంది. ఆయా ప్రాంతాల్లో బాధ్యులైన అధికారులు, సిబ్బందికి లక్ష్యాలను నిర్దేశించి తగిన చర్యలు తీసుకోవడానికి వీలవుతుంది. రాష్ట్రంలో ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఎర్రగడ్డలో ‘సూపర్వైజరీ కంట్రోల్‌ అండ్‌ డేటా అక్విజిషన్‌(స్కాడా)’కేంద్రం ఉంది. జీహెచ్‌ఎంసీ పరిధిలో నిరంతర విద్యుత్‌ సరఫరాను దీని ద్వారా సమీక్షిస్తుంటారు. ఇకపై అన్ని పట్టణాల్లో స్కాడా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. మరోవైపు వ్యవసాయ విద్యుత్‌ సరఫరా ఫీడర్లను వేరుచేసి, మీటర్లు ఏర్పాటు చేస్తే.. వ్యవసాయ వినియోగంపై కచ్చితమైన లెక్కలు బయటపడతాయి. ఇతర నష్టాలను వ్యవసాయ ఖాతాలో వేయడానికి అవకాశం ఉండదు. 

రూ.9,020 కోట్లు నష్టాలు: నీతి ఆయోగ్‌ 
రాష్ట్ర విద్యుత్‌ పంపిణీ సంస్థ (డిస్కం)లు 2018–19 నాటికి రూ.9,020 కోట్ల నష్టాలను మూటగట్టుకున్నాయని విద్యుత్‌ పంపిణీ రంగం– సంస్కరణలపై తాజాగా ప్రచురించిన అధ్యయన నివేదికలో నీతి ఆయోగ్‌ పేర్కొంది. తెలంగాణ వచ్చాక 2014–15లో రూ.2,912 కోట్లుగా ఉన్న నష్టాలు ఏటా పెరుగుతూ ఐదేళ్లలో మూడింతలైనట్టు తెలిపింది. నీతి ఆయోగ్‌ వెల్లడించిన గణాంకాలివీ..

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top