కేన్సర్‌ కారక ‘గ్లైఫోసేట్‌’ వాడకంపై కేంద్రం కీలక నిర్ణయం

Centre Govt Restricts Use Of Herbicide Glyphosate Over Health Hazards - Sakshi

పెస్ట్‌ కంట్రోల్‌ ఆపరేటర్లు తప్ప ఇతరులెవరూ కలుపుమందును వాడరాదని స్పష్టీకరణ 

మనుషులు, పశువుల ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపుతుందనే కట్టడి నిర్ణయమని వెల్లడి 

రాష్ట్రంలో బీజీ–3 పత్తి సహా ఇతర పంటల్లో విచ్చలవిడిగా వాడుతున్న రైతులు 

సాక్షి, హైదరాబాద్‌: దేశంలో విచ్చలవిడిగా వినియోగంలో ఉన్న కలుపుమందు గ్లైఫోసేట్‌ను నియంత్రించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. మనుషులు, పశువుల ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపుతుందన్న ఉద్దేశంతో దీని వాడకాన్ని కట్టడి చేయాలని రాష్ట్రాలను ఆదేశించింది. ఇకపై గ్లైఫోసేట్‌ను పెస్ట్‌ కంట్రోల్‌ ఆపరేటర్లు (పీసీఓ) తప్ప 
ఇతరులెవరూ ఉపయోగించరాదని స్పష్టం చేసింది.

ఈ మేరకు కేంద్ర వ్యవసాయ శాఖ గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. వాస్తవానికి దేశంలో గ్లైఫోసేట్‌ను కేవలం తేయాకు తోటల్లో కలుపు నివారణకే అమనుతివ్వగా పండ్ల తోటలు, ఇతర చోట్ల సైతం దాన్ని అక్రమంగా వినియోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ, కేరళ సహా మరికొన్ని రాష్ట్రాలు ఇప్పటికే ఈ కలుపుమందును నిషేధించాయి. మరోవైపు గ్లైఫోసేట్‌ వాడకంపై నియంత్రణ సరిపోదని... దాన్ని పూర్తిగా నిషేధించాలని రైతాంగ నిపుణులు డిమాండ్‌ చేయగా ప్రత్యామ్నాయం చూపకుండా ఉన్నపళంగా గ్లైఫోసేట్‌ వాడకంపై నియంత్రణ విధిస్తే రైతులు అన్యాయమైపోతారని అధికారులు చెబుతున్నారు.

గ్లైఫోసేట్‌తో కేన్సర్‌ ముప్పు... 
గ్లైఫోసేట్‌ వాడకం వల్ల పంటలు విషపూరితమై ప్రజలు కేన్సర్‌ బారినపడే అవకాశముందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆధ్వర్యంలోని అంతర్జాతీయ కేన్సర్‌ పరిశోధన సంస్థ (ఐఏఆర్‌సీ) 2015లో తేల్చింది. ఆ తర్వాత అమెరికా జరిపిన పరిశోధనల్లోనూ ఇదే విషయం నిర్ధారణ అయింది. అయితే తెలంగాణ సహా వివిధ రాష్ట్రాల్లో గ్లైఫోసేట్‌ వాడకం విచ్చలవిడిగా సాగుతోంది. గత నాలుగైదు ఏళ్లుగా నిషేధిత బీజీ–3 పత్తి పంటలో కలుపు నివారణతోపాటు పండ్ల తోటలు, చెరువు గట్లు, హరితహారంలో భాగంగా నాటిన మొక్కల పరిసరాల్లో కలు­పును తొలగించేందుకు కూలీల కొరత కారణంగా దీన్ని రైతులు విచ్చలవిడిగా వాడుతున్నారు.   

కంపెనీల లాబీయింగ్‌తోనే విచ్చలవిడి విక్రయాలు
గ్లైఫోసేట్‌ వాడకంపై నామమాత్రపు నియంత్రణ చర్యలే తప్ప ప్రభుత్వాలు కఠినంగా వ్యవహరించడంలేదు. నియంత్రణ సరిగా అమలు కాకపోతే ప్రజలకు అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఈ కలుపుమందు విక్రయాల కోసం కంపెనీలు భారీగా లాబీయింగ్‌ జరుపుతున్నాయి. మహారాష్ట్ర, తెలంగాణ, పంజాబ్‌ వంటి కొన్ని రాష్ట్రాలు దాని వినియోగాన్ని తాత్కాలికంగా పరిమితం చేయడానికి ప్రయత్నించినా ప్రయోజనం పెద్దగా ఉండదు. గ్లైఫోసేట్‌ బారిన పడిన వారికి నష్టపరిహారం చెల్లించాలి.     
– డి.నర్సింహారెడ్డి, జాతీయ వ్యవసాయ నిపుణుడు   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top