పార్కుల్లో సీసీటీవీలు

Central Government Has Ordered Installation Of CCTVs In Parks - Sakshi

ప్రజలు గుంపులుగా చేరకుండా పర్యవేక్షణకు ఏర్పాట్లు

భౌతికదూరం, మాస్క్, శానిటైజేషన్‌ తప్పనిసరి

కంటైన్మెంట్‌ జోన్లలో ఉండే వారికి ప్రవేశం నిషిద్ధం

ఫుడ్‌కోర్టులు, రెస్టారెంట్లలో 50 శాతం సీటింగ్‌ మించొద్దు

కరోనా నేపథ్యంలో కేంద్రం మార్గదర్శకాలు జారీ

సాక్షి, హైదరాబాద్‌: వినోదపు పార్కులు, ఫుడ్‌కోర్టుల్లో సీసీటీవీలు ఏర్పాటుచేసి సందర్శకులు గుంపుగా ఒకేచోటకు చేరకుండా పర్యవేక్షించాలని కేంద్ర ప్రభు త్వం ఆదేశించింది. కరోనా కంటైన్మెంట్‌ ఏరియాల్లో వినోదపు పార్కులు తెరవ కూడదని స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ తాజాగా మార్గదర్శకాలు జారీచేసింది. కరోనా వ్యాప్తి జరగకుండా వినోదపు పార్కుల్లో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొంది. వినోద కేంద్రాలకు, పార్కుల్లోకి సందర్శకులు విశ్రాంతి, వినోదం కోసం పెద్దసంఖ్యలో వస్తారు. కాబట్టి కరోనా నివారణ చర్యలు పాటించడం చాలా ముఖ్యమని నొక్కిచెప్పింది.

ఇవీ మార్గదర్శకాలు
 కనీసం ఆరడుగుల భౌతికదూరం పాటించాలి. మాస్క్‌ తప్పనిసరి. చేతులను తరచూ సబ్బుతో కడుక్కోవాలి. లేకుంటే ఆల్కహాల్‌ ఆధారిత హ్యాండ్‌ శానిటైజర్లను వాడాలి. ఉమ్మివేయడం నిషేధం.
65 ఏళ్లు పైబడిన, తీవ్రమైన అనారోగ్య సమస్యలున్నవారు, గర్భిణులు, పదేళ్లలోపు పిల్లలు ఇంట్లోనే ఉండాలి.
పార్కుల్లో పనిచేసే వారిలో అనారోగ్యంతో ఉన్నవారు, వయసు పైబడిన, గర్భిణులు అదనపు జాగ్రత్తలు తీసుకోవాలి.  వీరు ప్రజలతో ప్రత్యక్ష సంబంధం లేకుండా విధులు నిర్వహించాలి.
ఫుడ్‌కోర్టులు ఇతర చోట్ల రద్దీని గుర్తించడానికి íసీసీటీవీలతో పర్యవేక్షించాలి.
ప్రాంగణం లోపల, వెలుపల భౌతికదూరాన్ని పాటించేలా నేలపై నిర్ధిష్ట గుర్తులుపెట్టాలి. ప్రాంగణం లోపల, వెలుపల క్యూ పాటించాలి. క్యూ, భౌతికదూరం పర్యవేక్షణకు తగినంత మంది సిబ్బందిని నియమించాలి.
ఫుడ్‌ కోర్టులు, రెస్టారెంట్లలో 50 శాతం కంటే ఎక్కువ సీటింగ్‌ సామర్థ్యం అనుమతించకూడదు. ఫుడ్‌కోర్టు సిబ్బంది లేదా వెయిటర్లు మాస్క్‌లు, గ్లోవ్స్‌ ధరించాలి.
మ్యూజియంలు, ఉద్యానవనాలు, ఫుడ్‌ కోర్టులు, థియేటర్లు మొదలైన వాటితో పాటు డోర్‌ హ్యాండిల్స్, ఎలివేటర్‌ బటన్లు, కుర్చీలు, బెంచీలు, అంతస్తులు, గోడలు మొదలైనవాటిని సోడియం హైపోక్లోరైట్‌ ద్రావణంతో శుభ్రపరచాలి.
వాష్‌రూమ్‌లలో సబ్బు, ఇతర సాధారణ ప్రాంతాల్లో హ్యాండ్‌ శానిటైజర్లను తగినంత పరిమాణంలో ఉంచాలి. మాస్క్‌లు, శానిటైజర్లు, సబ్బులు, సోడియం హైపోక్లోరైట్‌ ద్రావణం, ఇతరత్రా లాజిస్టిక్స్‌ను అందుబాటులో ఉంచుకోవాలి.
సందర్శకులు, ఉద్యోగులు ఉపయోగించిన మాస్క్‌లను ప్రత్యేక కవర్‌ డబ్బాలలో పారవేసేలా ఏర్పాట్లు చేయాలి.
స్విమ్మింగ్‌పూల్స్‌ను మూసివేయాలి. నీటితో కూడిన వినోదం అందించే పార్కుల్లో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. అటువంటిచోట్ల నీటి వడపోత, క్లోరినేషన్‌ తప్పనిసరి.
రద్దీ ఎక్కువుండే వారాంతం, సెలవు రోజుల్లో ప్రత్యేక చర్యలు చేపట్టాలి.
ఆన్‌లైన్‌ టిక్కెట్‌ సదుపాయాన్ని ప్రోత్సహించాలి. టికెట్లు జారీ చేసేటప్పుడు చేయవలసిన, చేయకూడని సూచనలతో కూడిన కరపత్రాలు పంచాలి. లేదా టికెటట్లపైనే వాటిని ముద్రించవచ్చు.
సహజ వెలుతురు ఉండాలి. క్రాస్‌ వెంటిలేషన్‌ తగినంతగా ఉండాలి.
ఎవరైనా కోవిడ్‌ లక్షణాలతో బాధపడుతుంటే పార్కును సందర్శించవద్దని తెలపాలి. కంటైన్మెంట్‌ జోన్లలో ఉండే వారికి ప్రవేశం లేదు.
కోవిడ్‌ హెల్ప్‌లైన్‌ నంబర్లను, స్థానిక ఆరోగ్య అధికారుల ఫోన్‌ నంబర్లను ప్రదర్శించాలి.
ప్రవేశద్వారం వద్ద శానిటైజర్‌ డిస్పెన్సర్, థర్మల్‌ స్క్రీనింగ్‌ తప్పక ఏర్పాటుచేయాలి. ఎగ్జిట్‌ మార్గాల కోసం వీలైనన్ని గేట్లు ఏర్పాటు చేయాలి. 
వాలెట్‌ పార్కింగ్‌ అందుబాటులో ఉంటే మాస్క్‌లు ధరించిన ఆపరేటింగ్‌ సిబ్బందితో పనిచేయించాలి. వాహనాల స్టీరింగ్, డోర్‌ హ్యాండిల్స్, కీలు మొదలైన వాటిని శుభ్రపరచాలి.
పార్క్‌ ప్రాంగణంలో కుర్చీలు, బెంచీలు మొదలైన వాటి మధ్య ఆరడుగుల దూరం ఉండాలి. 
కాంటాక్ట్‌లెస్‌ ఆర్డరింగ్‌ మోడ్, డిజిటల్‌ మోడ్‌ చెల్లింపులను ప్రోత్సహించాలి.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top