TS: జయశంకర్‌ వ్యవసాయ వర్సిటీ పంటల ధరలపై విశ్లేషణ.. పత్తి, వరి ధరలు ఎంతంటే.. 

Prof Jayashankar Agriculture University Price Analysis On Crops - Sakshi

ఖరీఫ్‌ పంటల మార్కెట్‌ ధరలపై ముందస్తు అంచనాలు

గత కొన్నేళ్ల ధరలు విశ్లేషించిన వ్యవసాయ మార్కెట్‌ ఇంటెలిజెన్స్‌ కేంద్రం 

వరి, కంది ఇతర ప్రధాన పంటల ధరలూ ప్రకటన 

గ్రేడ్‌ ఏ రకం వరి క్వింటాల్‌ రూ.2,460.. 

మిర్చి క్వింటాల్‌ కనీసం రూ.20,000 

ఈ ధరలను బట్టి రైతులు పంటల సాగుపై నిర్ణయం తీసుకోవాలి 

ప్రొఫెసర్‌ జయశంకర్‌ వ్యవసాయ విద్యాలయం సూచన 

సాక్షి, హైదరాబాద్‌: వానాకాలం సీజన్‌ ప్రారంభమవుతోంది. త్వరలో రాష్ట్రానికి రుతుపవనాలు రానున్నాయి. రైతులు సాగుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో విత్తనాలు కొనుగోలు చేసే పనిలో నిమగ్నమయ్యారు. అయితే ఈ సీజన్‌లో ఏ పంటలు వేయాలన్న దానిపై రైతుల్లో కొంత గందరగోళం నెలకొంది. కొందరు అవగాహన లేకపోవడం వల్ల ఏదో ఒక పంట వేసి నష్టపోతుంటారు. కొందరు సరైన అవగాహన, ప్రణాళికతో మంచి లాభాలు పొందుతుంటారు. కోతలు ముగిసే సమయానికి ఏ పంటకు ఎంత ధర ఉండే అవకాశం ఉందో ముందుగా అంచనా వేయగలిగితే.. రైతులు ఆ ప్రకారం పంటలు సాగు చేసుకునే వీలుంది. 

ఈ నేపథ్యంలో ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలోని వ్యవసాయ మార్కెట్‌ ఇంటెలిజెన్స్‌ కేంద్రం రంగంలోకి దిగింది. రాష్ట్రంలోని ప్రధాన మార్కెట్లలో 15 నుంచి 21 ఏళ్ల నెలవారీ ధరలను విశ్లేషించింది. ఈ విశ్లేషణ ఫలితాలు, మార్కెట్‌ సర్వేలను పరిశీలించి 2023–24 వానాకాలం (ఖరీఫ్‌) పంటల ధరలు ఏ విధంగా ఉండవచ్చో అంచనా వేసింది. వరంగల్‌ ప్రధాన మార్కెట్‌ను పరిగణనలోకి తీసుకుంటే వచ్చే నవంబర్‌–ఫిబ్రవరి మధ్య కాలంలో పత్తి ధర క్వింటాల్‌కు రూ.7,550 నుంచి రూ.8,000 వరకు ఉంటుందని తెలిపింది. 

దీనితో పాటు వరి, మిర్చి, కంది తదితర పంటల ధరలను కూడా అంచనా వేసింది. అయితే పంట రకం, నాణ్యత, అంతర్జాతీయ ధరలు, ఎగుమతి లేదా దిగుమతి పరిమితులపై ఆధారపడి అంచనా ధరల్లో మార్పు ఉండొచ్చని పేర్కొంది. కాగా వ్యవసాయ మార్కెట్‌ ఇంటెలిజెన్స్‌ కేంద్రం అంచనాల ప్రకారం..ఏయే పంటలు వేయాలో నిర్ణ యం తీసుకుని రైతులు సాగుకు సన్నద్ధం కావాలని ప్రొఫెసర్‌ జయశంకర్‌ వ్యవ సాయ విశ్వవిద్యాలయం సూచించింది.  

మద్దతు ధరల కంటే ఎక్కువే..  
ఈ ఏడాది రాష్ట్రంలో 65 లక్షల ఎకరాల నుంచి 70 లక్షల ఎకరాల వరకు పత్తి సాగు అయ్యేలా చూడాలని అధికారులు భావిస్తున్నారు. ఆ మేరకు రైతులకు సూచిస్తున్నారు. ఆ తర్వాత వరి ఎలాగూ భారీగానే సాగవుతుంది. కాబట్టి పత్తి తర్వాత కంది సాగును కూడా పెంచాలనేది సర్కారు ఉద్దేశం. కాగా ఖరీఫ్‌లో పత్తి, వరి, కంది పంటలకు మద్దతు ధరకంటే ఎక్కువ ధరలే లభిస్తాయని వ్యవసాయ మార్కెట్‌ ఇంటిలిజెన్స్‌ కేంద్రం అంచనా వేయడం గమనార్హం. 

పత్తికి మద్దతు ధర క్వింటాల్‌కు రూ.6,380గా ఉంది. అయితే 2021–22 వానాకాలం సీజన్‌లో పత్తి ధర మార్కెట్లో ఏకంగా రూ.12 వేల వరకు పలికింది. దీంతో రైతులు గత సీజన్‌లో అంత ధర వస్తుందని భావించారు. కానీ రూ. 7–8 వేలకు మించలేదు. దీంతో చాలామంది రైతులు మంచి ధర కోసం ఎదురుచూస్తూ పత్తిని ఇళ్లల్లోనే దాచుకున్నారు. అందులో చాలావరకు పాడైపోయింది. ఇక ఈసారి కూడా పత్తి ధర రూ.8 వేల వరకు ఉంటుందని వ్యవసాయ మార్కెట్‌ ఇంటెలిజెన్స్‌ కేంద్రం ప్రకటించడంతో రైతులు పత్తి సాగుకు ఏ మేరకు ముందుకు వస్తారో చూడాల్సి ఉంటుంది. 

ఇది కూడా చదవండి: నైరుతి రాక.. జూన్‌ రెండో​ వారం నుంచి వానలు!

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top