గవర్నర్ కోసం ట్రాఫిక్ నిలిపివేత
తిరుత్తణి: గవర్నర్ కాన్వాయ్ కోసం చెరుకు ట్రాక్టర్లు రెండు గంటల పాటు నిలిపివేయడంతో రైతులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తమిళనాడు గవర్నర్ ఆర్‌ఎన్.రవి తిరుమలలో స్వామిని దర్శనం చేసుకుని ఆదివారం మధ్యాహ్నం రోడ్డు మార్గంలో చైన్నెకు బయలుదేరారు. దీంతో చైన్నె–తిరుపతి జాతీయ రహదారిలో ఉదయం నుంచి పోలీసులు బందోబస్తు నిర్వహించారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో తిరుత్తణి నుంచి తిరువలంగాడులోని తిరుత్తణి సహకార చక్కెర ఫ్యాక్టరీకి చెరుకు తరలిస్తున్న ట్రాక్టర్లు, లారీలు, ఇతర భారీ వాహనాలకు పోలీసులు అనుమతి నిరాకరించారు. తిరుత్తణి బైపాస్ వద్ద ఆపేశారు. రెండు గంటల పాటు రైతులు, వాహన డ్రైవర్లు పడిగాపులు కాచారు. మధ్యాహ్నం 2 గంటలకు తిరుత్తణి మార్గంలో గవర్నర్ వాహనం వెళ్లిన తరువాత వాహనాలు వెళ్లేందుకు పోలీసులు అనుమతించారు.


