వీధి కుక్కదాడిలో
చిన్నారికి గాయాలు
తిరువళ్లూరు: తల్లితో వెళ్తున్న బాలికను వీధికుక్క లాక్కెళ్లిన ఘటన సంచలనం రేపింది. ఈ ఘటనలో చిన్నారి తీవ్రంగా గాయపడింది. వివరాలు.. తిరువళ్లూరు మున్సిపాలిటీలోని 11వ వార్డులో పుల్లరంబాక్కం గ్రామానికి చెందిన వినోధ్ తల్లి నివాసం ఉంటున్నారు. ఈ మేరకు వినోద్ భార్య దేవయాని కుమార్తె తమిళ్‌ని(02) వెళ్లారు. కామరాజర్ విగ్రహం నుంచి ఇంటికి వెళ్లే సమయంలో వీధికుక్కలు బాలికను లాక్కెళ్లి దాడి చేసింది. ఈ దాడిలో తమిళ్‌నిల తీవ్రంగా గాయపడింది. కుక్కల దాడిలో గాయపడ్డ బాలికను బంధువులు రక్షించి చికిత్స కోసం తిరువళ్లూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. చిన్నారిపై వీధికుక్కల దాడి చేసి వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
నీట్‌పై అప్పీల్ కొట్టివేత
కొరుక్కుపేట: నీట్ పరీక్ష సమయంలో విద్యుత్ అంతరాయంతో తాము ప్రభావితమయ్యామని, తిరిగి పరీక్ష నిర్వహించాలని కోరుతూ పలువురు అభ్యర్థులు దాఖలు చేసిన అప్పీల్‌ను మద్రాసు హైకోర్టు తోసిపుచ్చింది. అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ స్టడీస్ కోసం నీట్ పరీక్షను దేశవ్యాప్తంగా గతనెల 4వ తేదీన నిర్వహించారు. నీట్ పరీక్ష మళ్లీ నిర్వహించాలని కోరుతూ 16 మంది పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసును విచారించిన హైకోర్టు దేశవ్యాప్తంగా 22 లక్షల మంది విద్యార్థులు పరీక్ష రాశారని, తిరిగి పరీక్ష నిర్వహించాలని ఆదేశిస్తే అది నష్టదాయకమని పేర్కొంటూ కేసును కొట్టివేసింది. ఈ ఉత్తర్వులపై నీట్ విద్యార్థులు అప్పీల్ చేశారు. ఈ అప్పీళ్లను న్యాయమూర్తులు జి నిషాబాను, ఎం.జ్యోతిరామన్‌లు విచారించారు.
ప్రియుడితో నవ వధువు పరార్
అన్నానగర్: పెళ్లి రోజున బ్యూటీ సెలూన్‌కి వెళ్తున్నట్లు చెప్పి ప్రియుడితో నవ వధువు పరారైంది. పెరంబూర్‌లోని అంబేడ్కర్‌నగర్‌కు చెందిన అర్చనకు మాధవరం బర్మా కాలనీకి చెందిన విజయకుమార్‌తో వివాహం నిశ్చయం అయ్యింది. ఈ మేరకు బుధవారం ఉదయం బెసెంట్‌నగర్ ఆలయంలో వారి వివాహ వేడుక జరిగింది. తర్వాత వధూవరులు ఇంటికి వెళ్లారు. సాయంత్రం వివాహ విందుకు ఏర్పాట్లలో రెండు కుటుంబాలు బిజీగా ఉన్నాయి. అర్చన తన తల్లిదండ్రులకు రిసెప్షన్ కోసం బ్యూటీ సెలూన్‌కు వెళుతున్నానని చెప్పి, తన కొంతమంది స్నేహితులతో వెళ్లింది. అర్చన ఇంటికి తిరిగి రాలేదు. రిసెప్షన్ సమయం దగ్గర పడుతుండడంతో ఆందోళన చెందిన ఆమె తల్లిదండ్రులు అర్చన సెల్‌ఫోన్‌కు ఫోన్ చేశారు. కానీ అది స్విచ్ ఆఫ్‌లో ఉంది. ఆమెతోపాటు వచ్చిన ఆమె స్నేహితులు కూడా అదృశ్యమయ్యారు. ఆమె తల్లిదండ్రులు విచారించగా, అర్చన ఇప్పటికే ఎరుకంజేరికి చెందిన ఒక యువకుడిని ప్రేమించిందని, పెళ్లి తర్వాత అతనిని వివాహం చేసుకోవాలని ప్లాన్ చేసిందని వారికి తెలిసింది. బ్యూటీ సెలూనన్‌కు వెళ్లే నెపంతో ఆమె తన ప్రియుడితో పారిపోయిందని కూడా తేలింది. వధువు అదృశ్యం కావడంతో వరుడు, అతని బంధువులు దిగ్భ్రాంతి చెందారు. దీంతో వివాహ రిసెప్షన్ రద్దు చేసుకున్నారు. ఈ విషయమై అర్చన తల్లి తిరు.వి.కె.నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ఈ విషయంపై దర్యాప్తు చేస్తున్నారు.
మందుల దుకాణంలో చోరీ
తిరువొత్తియూరు: మందుల దుకాణం తాళాలు పగులగొట్టి చోరీ చేసిన ఘటన కలకలం రేపింది. చైన్నె నందనం సీఐటీ నగర్, మసీదువీధికి చెందిన రిల్వాన్ సీఐటీ నగర్ నాలుగో ప్రధాన రోడ్డులో మందుల దుకాణం నడుపుతున్నాడు. అతను బుధవారం రాత్రి దుకాణం మూసి వేసి, ఇంటికి వెళ్లాడు. గురువారం ఉదయం రిల్వాన్ దుకాణం వద్దకు వచ్చిన చూడగా దుకాణం తాళం పగులగొట్టి ఉంది. దుకాణంలో ఉంచిన రూ.40 వేల నగదును దుండగులు చోరీ చేసినట్టు గుర్తించాడు. ఈ విషయమై సైదాపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
యువకుడిపై దాడి
ముగ్గురి అరెస్టు
తిరుత్తణి: మద్యం మత్తులో యువకుడిని కత్తితో దాడి చేసిన కేసులో ముగ్గురిని పోలీసులు గురువారం అరెస్టు చేశారు. తిరుత్తణి సమీపంలోని మద్దూరు గ్రామానికి చెందిన వెంకటేశన్(27) బుధవారం రాత్రి గ్రామ శివారులో మద్యం సేవిస్తుండగా అటువైపు మద్యం మత్తులో బైకులో వెళ్లిన ముగ్గురు వ్యక్తులు వెంకటేశన్‌తో గొడవకు దిగారు. ఈ సందర్భంగా వారి మధ్య వాగ్వాదం చోటుచేసుకోవడంతో ఆగ్రహించిన బైకులో వెళ్లిన వ్యక్తి మద్యం మత్తులో పక్కనే ఉన్న ఇంటి వద్ద నుంచి కత్తి తీసుకొచ్చి వెంకటేశన్ తలపై నరికి పారిపోయారు. తీవ్రంగా గాయపడిన వెంకటేశన్‌ను కుటుంబసభ్యులు తిరుత్తణి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ సంఘటనకు సంబంధించి బాధితుడి ఫిర్యాదు మేరకు తిరుత్తణి పోలీసులు కేసు నమోదు చేసి మద్దూరుకు చెందిన విశ్వనాథన్(22), ఆర్‌వీఎన్ కండ్రిగకు చెందిన సారధి(23), మూలమద్దూరుకు చెందిన రఘు(28)ను అరెస్టు చేశారు.